UPI: జెట్ స్పీడ్‌లో యూపీఐ లావాదేవీలు.. ఒక్క ఏడాదిలోనే 33శాతం గ్రోత్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత వేగంగా విస్తరిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2025 సంవత్సరంలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు 33 శాతం పెరిగి 228.5 బిలియన్లకు చేరాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.299.74 ట్రిలియన్లుగా నమోదైంది. ఈ వివరాలను 'వరల్డ్‌లైన్' విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం, వ్యాపారులకు చేసే చెల్లింపులు (P2M) 34 శాతం వృద్ధి చెంది 143.82 బిలియన్లకు చేరాయి. యూపీఐ సగటు లావాదేవీ విలువ (యావరేజ్ టికెట్ సైజ్) 9 శాతం తగ్గి రూ.1,314గా నమోదైంది. ముఖ్యంగా వ్యాపారుల వద్ద జరిగే చెల్లింపుల సగటు విలువ రూ.592కు పడిపోయింది.
వివరాలు
డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా వినియోగంలోకి
చిన్నచిన్న కొనుగోళ్లకు కూడా డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా వినియోగంలోకి వస్తున్నాయని ఇది సూచిస్తోంది. డిజిటల్ చెల్లింపులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2025లో యూపీఐ క్యూఆర్ కోడ్‌ల సంఖ్య 15 శాతం పెరిగి 731.38 మిలియన్లకు చేరింది. "భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పరిణితిలో కొత్త దశకు చేరుకుంటోంది" అని వరల్డ్‌లైన్ ఇండియా సీఈఓ రమేష్ నరసింహన్ పేర్కొన్నారు. మరోవైపు భారత్ బిల్ పే ద్వారా జరిగే రికరింగ్ చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. వీటి లావాదేవీల సంఖ్య 40 శాతం పెరిగి 3.05 బిలియన్లకు చేరగా, మొత్తం విలువ 93 శాతం వృద్ధితో రూ.14.84 ట్రిలియన్లకు పెరిగింది.
వివరాలు
డెబిట్ కార్డుల వినియోగం 23 శాతం తగ్గింది
విద్యా ఫీజులు, బీమా ప్రీమియాలు, ఈఎంఐలు వంటి చెల్లింపులు దీని ద్వారా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక క్రెడిట్ కార్డు లావాదేవీలు 27 శాతం పెరిగినప్పటికీ, చిన్న మొత్తాల చెల్లింపులు యూపీఐకి మారడంతో డెబిట్ కార్డుల వినియోగం 23 శాతం తగ్గింది. మొత్తం మీద భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత విస్తృతంగా మారుతూ, నగదు వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తున్నట్లు స్పష్టమవుతోంది.