LOADING...
UPI: యూపీఐ లావాదేవీల్లో ఈ ఏడాది ప్రథమార్థంలో 35 శాతం వృద్ధి..   
యూపీఐ లావాదేవీల్లో ఈ ఏడాది ప్రథమార్థంలో 35 శాతం వృద్ధి..

UPI: యూపీఐ లావాదేవీల్లో ఈ ఏడాది ప్రథమార్థంలో 35 శాతం వృద్ధి..   

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 2025 ప్రథమార్ధంలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య గతేడాదితో పోలిస్తే 35% పెరిగి 106.36 బిలియన్లకు చేరింది. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ. 143.34 లక్షల కోట్లకు ఎగబాకింది. ప్రజల రోజువారీ జీవితంలో డిజిటల్ చెల్లింపులు ఎంతగా సమ్మిళితమయ్యాయో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ వివరాలను 'వరల్డ్‌లైన్' సంస్థ బుధవారం విడుదల చేసిన *ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్‌ (1H 2025)*లో వెల్లడించింది. నివేదిక ప్రకారం యూపీఐ ద్వారా జరిగే సగటు లావాదేవీ విలువ తగ్గడం గమనార్హం.

వివరాలు 

భారీగా విస్తరించిన క్యూఆర్ కోడ్, పీఓఎస్ నెట్‌వర్క్ 

2024 మొదటి అర్ధభాగంలో ఒక లావాదేవీ సగటు విలువ రూ. 1,478గా ఉండగా, 2025 ఇదే కాలానికి అది రూ. 1,348కు పడిపోయింది. దీని అర్థం ప్రజలు ఇప్పుడు చిన్నచిన్న కొనుగోళ్లు.. టీ షాప్‌లు, కిరాణా దుకాణాలు, ఆన్‌లైన్ ఆర్డర్లు వంటి వాటికి.. యూపీఐని విస్తృతంగా ఉపయోగిస్తున్నారని సూచిస్తోంది. ప్రత్యేకించి వ్యక్తుల నుండి వ్యాపారులకు (P2M) జరిగే లావాదేవీలు 37% పెరిగి 67.01 బిలియన్లకు చేరాయి. దీనికి 'కిరాణా ఎఫెక్ట్' ముఖ్య కారణమని వరల్డ్‌లైన్ పేర్కొంది. దేశవ్యాప్తంగా చిన్న, సూక్ష్మ వ్యాపారాలు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మర్చంట్ నెట్‌వర్క్‌ ఏర్పరచుకున్న దేశంగా ఎదిగింది.

వివరాలు 

యూపీఐ వాడకం పెరగడంతో తగ్గిన డెబిట్ కార్డుల వినియోగం 

ఈ వేగవంతమైన వృద్ధికి అనుగుణంగా చెల్లింపుల మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాయి. 2024 జనవరితో పోలిస్తే దేశంలో క్యూఆర్ కోడ్‌ల సంఖ్య 111% పెరిగి 2025 జూన్‌ నాటికి 678 మిలియన్లకు చేరింది. అలాగే పాయింట్-ఆఫ్-సేల్‌ (పీఓఎస్‌)యంత్రాల సంఖ్య 29% వృద్ధితో 11.2మిలియన్లకు చేరుకుంది. ఇక క్రెడిట్ కార్డుల వినియోగం ప్రీమియం ఖర్చుల కోసం మరింతగా పెరుగుతోంది. యాక్టివ్‌ క్రెడిట్ కార్డుల సంఖ్య 23% పెరిగినట్లు నివేదిక తెలిపింది.అయితే,చిన్న చెల్లింపులు యూపీఐ వైపు మళ్లడంతో పీఓఎస్ వద్ద డెబిట్ కార్డుల వినియోగం దాదాపు 8% తగ్గింది. మొత్తం మీద మొబైల్‌ చెల్లింపులు 30% వృద్ధి నమోదు చేసి 98.9 బిలియన్ల లావాదేవీలను సాధించాయి. వీటి మొత్తం విలువ రూ. 209.7 ట్రిలియన్లకు చేరింది.