LOADING...
UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారా? ఎన్‌పీసీఐ క్లారిటీ ఇదిగో..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారా? ఎన్‌పీసీఐ క్లారిటీ ఇదిగో..

UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారా? ఎన్‌పీసీఐ క్లారిటీ ఇదిగో..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2026
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా యూపీఐ వినియోగం రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. ఫుట్‌పాత్‌పై చిన్నచిన్న దుకాణాల నుంచి భారీ షాపింగ్ మాల్స్ వరకూ ప్రతి చోటా డిజిటల్ చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తోంది. యూపీఐ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యాపారులకు,వినియోగదారులకు నగదు చెల్లింపులు మరింత సులభమయ్యాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు,కొన్ని సెకన్లలోనే డబ్బు చెల్లింపు పూర్తవుతోంది. అంతేకాదు, ఎవరికైనా డబ్బు పంపాల్సి వచ్చినా యూపీఐ నంబర్ ద్వారా క్షణాల్లోనే ట్రాన్స్‌ఫర్ చేసే సౌకర్యం ఉంది. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలలో చాలా వరకు ఉచితంగానే జరుగుతున్నాయి.

వివరాలు 

రూ.వెయ్యి దాటితే ఛార్జీలు..?

ఎలాంటి సర్వీస్ ఛార్జీలు అవసరం లేకపోవడంతో ప్రజలు విస్తృతంగా వీటిని వినియోగిస్తున్నారు. అయితే త్వరలో యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధించబోతున్నారనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. రూ.వెయ్యికి మించిన యూపీఐ లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనున్నారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చాలామందిలో అనవసరమైన ఆందోళన నెలకొంది.ఈ ప్రచారంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు గానీ, వ్యక్తులు-వ్యాపారుల మధ్య జరిగే చెల్లింపులు గానీ—వాటిపై ఎలాంటి ఛార్జీలు విధించడం లేదని వెల్లడించింది. ప్రస్తుతం కూడా అలాంటి ప్రతిపాదన లేదని, బయట వినిపిస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించింది.

వివరాలు 

ప్రస్తుత లిమిట్ ఎంతంటే..?

డిజిటల్ ఇండియా లక్ష్యాలను దెబ్బతీసే తప్పుడు వార్తలకు దూరంగా ఉండాలని, అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సాధారణ యూపీఐ వినియోగదారులు రోజుకు గరిష్టంగా రూ.లక్ష వరకు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. వ్యాపార ఖాతాలకు సంబంధించి అయితే రోజుకు రూ.5 లక్షల వరకు ట్రాన్సాక్షన్లకు అవకాశం ఉంది. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో యూపీఐ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరు వ్యాపారులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ భారం పడకుండా ఈ నిధులను ఉపయోగించనున్నారు. అయితే కరెంట్ బిల్లులు, ఇతర సేవల బిల్లుల చెల్లింపుల విషయంలో మాత్రం ప్రస్తుతం సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement