Anthropic: చైనా ల్యాబ్స్‌పై ఆంథ్రోపిక్ సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కృత్రిమ మేధస్సు రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీ రాజకీయ-భౌగోళిక ఉద్రిక్తతలకు దారితీసే స్థాయికి చేరుతోంది. అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ (Anthropic) మూడు చైనా కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తమ 'Claude' మోడళ్ల సామర్థ్యాలను DeepSeek, Moonshot AI, MiniMax అక్రమంగా కాపీ చేస్తున్నాయని ఆ సంస్థ పేర్కొంది. ఈ మూడు చైనా ప్రయోగశాలలు సుమారు 24 వేల నకిలీ ఖాతాలను ఉపయోగించి, 'Claude'తో దాదాపు 16 మిలియన్ పరస్పర చర్యలను సృష్టించాయని ఆంథ్రోపిక్ వెల్లడించింది. సంస్థ నిబంధనలను అతిక్రమిస్తూ 'డిస్టిలేషన్' పద్ధతిని అమలు చేస్తున్నారని ఆరోపించింది. డిస్టిలేషన్ అనేది శిక్షణా సాంకేతికత.
వివరాలు
తక్కువ వ్యయంతోనే అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అనుకరణ
ఇందులో శక్తివంతమైన ఏఐ మోడల్ ఇచ్చే ఫలితాలను ఆధారంగా తీసుకుని, తక్కువ సామర్థ్యం గల చిన్న మోడల్‌ను శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. చట్టబద్ధ అవసరాల కోసం ఏఐ రంగంలో ఈ విధానాన్ని సాధారణంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా సంస్థల అంతర్గత అవసరాలకు తక్కువ ఖర్చుతో కూడిన చిన్న వెర్షన్లను తయారు చేయడం సాధారణ ప్రక్రియ. అయితే ఇదే పద్ధతిని ప్రత్యర్థి సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆంథ్రోపిక్ ఆరోపిస్తోంది. పోటీ కంపెనీలు ఎక్కువ సమయం ఖర్చు చేయకుండా, తక్కువ వ్యయంతోనే అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అనుకరిస్తున్నాయని సంస్థ పేర్కొంది. ఈ విధంగా రూపొందే చిన్న మోడళ్లలో సాంకేతిక దుర్వినియోగాన్ని నిరోధించే రక్షణ వ్యవస్థలు ఉండకపోవచ్చని వినియోగదారులను హెచ్చరించింది.
వివరాలు
ఆంథ్రోపిక్ సీఈఓకు సమన్లు
కోడింగ్, ఏజెంటిక్ రీజనింగ్, టూల్ వినియోగం, కంప్యూటర్ వినియోగ ఏజెంట్లు, కంప్యూటర్ విజన్ వంటి సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు చైనా సంస్థలు ఈపరస్పర చర్యలను వినియోగించాయని అమెరికా స్టార్టప్ పేర్కొంది. ఇటువంటి ఉల్లంఘనలను గుర్తించి అడ్డుకునేందుకు తమ డిటెక్షన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించింది. ఇక మరోవైపు,ఆంథ్రోపిక్ సీఈఓ Dario Amodeiకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం Pentagon సమన్లు జారీ చేసింది. రక్షణమంత్రి Pete Hegsethతో సమావేశం కావాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ స్టార్టప్ అభివృద్ధి చేస్తున్నకొత్త ఫీచర్లలో సైనిక అవసరాలకు అన్వయించే అంశాలు కూడా ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం మిలిటరీ క్లాసిఫైడ్ సిస్టమ్స్.. అంటే అత్యంత సున్నితమైన సమాచారాన్ని నిర్వహించే వ్యవస్థల్లో.. అందుబాటులో ఉన్న ఏకైక మోడల్ ఇదేనని పేర్కొంటున్నారు.
వివరాలు
చట్టబద్ధ అవసరాల కోసం ఏఐ మోడళ్లను అందుబాటులో ఉంచాలి : అమెరికా
నిఘా,రక్షణ కార్యకలాపాల కోసం దీనిని వినియోగించే అవకాశముంది. చట్టబద్ధ అవసరాల కోసం ఏఐ మోడళ్లను అందుబాటులో ఉంచాలని అమెరికా ప్రభుత్వం ఆంథ్రోపిక్‌ను కోరుతోంది. దేశ జాతీయ భద్రతకు మద్దతుగా కృత్రిమ మేధస్సు సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని సంస్థ చెబుతోంది. అయితే వినియోగ పరిమితులను సడలించాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై మాత్రం ఆంథ్రోపిక్ సమ్మతించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజా సమన్లు జారీ అయినట్లు సమాచారం.