LOADING...
West Asian War: ఇరాన్‌ చమురు వచ్చేస్తోంది.. ప్రత్యామ్నాయాల్లో భారత్‌ దూకుడు
ఇరాన్‌ చమురు వచ్చేస్తోంది.. ప్రత్యామ్నాయాల్లో భారత్‌ దూకుడు

West Asian War: ఇరాన్‌ చమురు వచ్చేస్తోంది.. ప్రత్యామ్నాయాల్లో భారత్‌ దూకుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2026
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా విధించిన అంతర్జాతీయ ఆంక్షల కారణంగా భారత్‌ 2019 మే నుంచి ఇప్పటి వరకు ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు చేయడం నిలిపివేసింది. అయితే ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరింది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లకు అమెరికా తాజాగా అనుమతి ఇచ్చింది. దీంతో ఇరాన్‌ ట్రేడర్లు భారతీయ రిఫైనరీలకు చమురు సరఫరా చేసేందుకు ముందుకొచ్చారు. ఐసీఈ బ్రెంట్‌ ముడి చమురు ధర కంటే ఎక్కువ రేటుకే సరఫరా చేస్తామని వారు సూచించినట్లు సమాచారం. భారత్‌ తన చమురు అవసరాల్లో సుమారు 88 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది.

వివరాలు 

రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కూడా అనుమతులు

అమెరికా,ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్‌ జలసంధిలో అంతరాయం ఏర్పడటంతో చమురు రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో చమురు,ఎల్‌పీజీ,సీఎన్‌జీ సరఫరాలో ఆటంకాలు తలెత్తి ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ప్రపంచ దేశాలన్నింటికీ పడుతోంది.ధరలను అదుపులో ఉంచే ఉద్దేశంతో అమెరికా, ఇరాన్‌ చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా 30 రోజులపాటు ఎత్తివేసింది. అంతకుముందే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కూడా అనుమతులు ఇచ్చింది. దాంతో భారతీయ రిఫైనరీలు ఇప్పటికే 40మిలియన్‌ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయి. దేశంలో వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) అవసరాలు కూడా ఎక్కువగా ఉండటంతో, ఇరాన్‌ చమురుపై ఇప్పుడు భారత రిఫైనరీలు దృష్టి సారిస్తున్నాయి.

వివరాలు 

రూపాయల్లోనైనా సరే..

ఇరాన్‌ చమురు కొనుగోలు చేసే వారు సాధారణంగా డాలర్లలోనే చెల్లింపులు చేయాలని నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీతో పాటు ఇతర ట్రేడర్లు సూచిస్తున్నట్లు సమాచారం. అయితే కొందరు ట్రేడర్లు రూపాయల్లో చెల్లించినా సరేనని చెబుతున్నట్లు తెలుస్తోంది. 1970 దశకంలో జరిగిన రెండు చమురు సంక్షోభాల కంటే ప్రస్తుత ఇంధన సంక్షోభం మరింత తీవ్రమైందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పేర్కొనడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

Advertisement

వివరాలు 

బ్రెంట్‌పై 6-8 డాలర్లు ఎక్కువగా..

ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేసి సముద్ర మార్గంలో తరలించేందుకు అమెరికా మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 19 వరకు 30 రోజులపాటు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు ట్యాంకర్లతో పాటు అన్ని రకాల నౌకలకు వర్తిస్తుంది. ఐసీఈ బ్రెంట్‌ ముడి చమురు ధరపై బ్యారెల్‌కు 6 నుంచి 8 డాలర్ల అదనపు ప్రీమియంతో ఇరాన్‌ ట్రేడర్లు తమ చమురును ఆఫర్‌ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సరుకు గమ్యస్థానానికి చేరిన 7 రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుందని సమాచారం.

Advertisement

వివరాలు 

రిలయన్స్‌ ఇప్పటికే ముందడుగు..

అమెరికా ఆంక్షలు సడలించిన వెంటనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ, నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీ (NIOC) నుంచి 5 మిలియన్‌ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కొనుగోలుకు బ్రెంట్‌ ధరపై బ్యారెల్‌కు సుమారు 7 డాలర్లు అదనంగా చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై రిలయన్స్‌ లేదా ఎన్‌ఐఓసీ అధికారికంగా స్పందించలేదు.

Advertisement