US: భారత దిగుమతులపై 12.5% టారిఫ్‌లు.. అమెరికా కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో పాటు మరో 53 దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అదనంగా 12.5 శాతం సుంకాలు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. ఉత్పత్తుల తయారీలో బలవంతపు కార్మికుల వినియోగం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) ప్రకటించింది. సెక్షన్ 301 కింద నిర్వహించిన 60 వేర్వేరు దర్యాప్తుల అనంతరం ఈ ప్రతిపాదనను వెల్లడించింది. ఈ నిర్ణయం భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల సమయంలో రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బలవంతపు కార్మికుల వినియోగానికి సంబంధించిన ఆరోపణలను భారత్ ఖండించింది. ఈ అంశాన్ని ఏకపక్ష చర్యల ద్వారా కాకుండా, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించాలని వాషింగ్టన్‌ను కోరింది.
వివరాలు
భారత్‌తో పాటు 53 దేశాలపై 12.5శాతం సుంకం విధించే అవకాశం
ఇదిలా ఉండగా,ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) ఖరారు చేసేందుకు అమెరికా,భారత ప్రతినిధులు న్యూఢిల్లీలో మూడు రోజులపాటు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో సెక్షన్ 301 దర్యాప్తుల నుంచి ఉపశమనం పొందడం,పోటీ దేశాలతో పోలిస్తే తక్కువ సుంకాలు సాధించడం వంటి అంశాలపై భారత్ దృష్టి పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఒప్పందానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఖరారైన తర్వాత అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ భారత్‌ను సందర్శించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. అమెరికా ప్రతిపాదన ప్రకారం భారత్‌తో పాటు 53 దేశాలపై 12.5శాతం సుంకం విధించే అవకాశం ఉంది. అయితే కెనడా,మెక్సికో,యూరోపియన్ యూనియన్,తైవాన్,యూకే వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10శాతం సుంకం మాత్రమే వర్తించనుంది.
వివరాలు
కొత్తసుంకాలు వెంటనే అమల్లోకి రావు.. స్పష్టం చేసిన అమెరికా ప్రభుత్వం
దీంతో ఇతరదేశాల కంటే తక్కువ సుంకాలు ఉండేలా భారత్ ప్రయత్నించనుంది. అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 ప్రకారం,ఇతర దేశాల ప్రభుత్వాల విధానాలు,చర్యలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు హానికరంగా ఉన్నాయా లేదా అనే అంశంపై USTR దర్యాప్తు చేయవచ్చు. అవి అన్యాయంగా లేదా వివక్షపూరితంగా ఉన్నట్లు తేలితే అదనపు సుంకాలు లేదా ఇతర వాణిజ్య పరమైన చర్యలు తీసుకునే అధికారం అమెరికాకు ఉంటుంది. అయితే ఈ కొత్తసుంకాలు వెంటనే అమల్లోకి రావని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ,సమీక్ష ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. జూలై 6లోపు లిఖితపూర్వక అభిప్రాయాలు స్వీకరించనుండగా,జూలై 7 నుంచి సెక్షన్ 301ప్యానెల్ బహిరంగ విచారణలు నిర్వహించే అవకాశం ఉందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.