US Visa New Rules: ఇక సోషల్ మీడియా చెక్ తర్వాతే వీసా మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో వీసా నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. ముఖ్యంగా వలసదారుల విషయంలో కొత్త రూల్స్ అమలు దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే వలస విధానాల్లో కట్టుదిట్టమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే హెచ్-1బీ వంటి ముఖ్యమైన వీసాలపై 'సోషల్ మీడియా వెట్టింగ్'ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విధానాన్ని మరిన్ని వీసా కేటగిరీలకు కూడా విస్తరించారు. మార్చి 30 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
వివరాలు
ఈ వీసాలకు అప్లై చేసే వారి ఆన్‌లైన్ కార్యకలాపాల పరిశీలన
ఇప్పటి వరకు కొన్ని వీసాలకు మాత్రమే పరిమితమైన సోషల్ మీడియా వెట్టింగ్‌ను,ఇకపై ఏ-3,సీ-3 (డొమెస్టిక్ వర్కర్లు), జీ-5,హెచ్-3,హెచ్-4 (హెచ్-3 డిపెండెంట్స్), కె, క్యూ, ఆర్, ఎస్, టీ, యూ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా తప్పనిసరి చేశారు. జాతీయ భద్రత దృష్ట్యా గత ఏడాది ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన అమెరికా ప్రభుత్వం, డిసెంబరు నుంచి హెచ్-1బీ, హెచ్-4, ఎఫ్, ఎం, జే వీసాలకు అప్లై చేసే వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అసలు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ఏమిటి అంటే... వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయించడానికి, వారి సోషల్ మీడియా యాక్టివిటీని అధికారులు పూర్తిగా పరిశీలిస్తారు.
వివరాలు
ప్రైవసీ సెట్టింగ్స్‌ను పబ్లిక్‌గా మార్చాలి
దరఖాస్తుదారుల ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఖాతాల్లో వారు చేసే పోస్టులు, షేర్లు, కామెంట్లు అన్నింటినీ స్కాన్ చేస్తారు. ఈ పరిశీలన తర్వాతే వీసా మంజూరు చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ఇందుకోసం అభ్యర్థులు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్‌ను పబ్లిక్‌గా మార్చాల్సి ఉంటుంది. వారు ఏ విధమైన కంటెంట్‌ను పంచుకుంటున్నారు? అది అమెరికా భద్రతకు ఎలాంటి ముప్పు కలిగిస్తుందా? అనే కోణంలో అధికారులు సమగ్రంగా తనిఖీలు నిర్వహిస్తారు.