9th Union Budget: కొత్త సెక్రటరీలు,సీనియర్ అధికారులు.. 9వ కేంద్ర బడ్జెట్ కోసం నిర్మలా సీతారామన్ బృందంలో కొత్త ముఖాలు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ,ఈసారి అనుభవం ఉన్న అధికారులు తో పాటు కొత్త ముఖాలపై కూడా ఆమె ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని విధంగా, ఈసారి ఫైనాన్స్ సెక్రటరీ లేకుండానే బడ్జెట్ ఏర్పాట్లు జరిగే సూచనలు ఉన్నాయి. సాధారణంగా బడ్జెట్ ప్రక్రియకు సమన్వయకర్తగా ఉండే ఈ పదవి ఈసారి ఖాళీగానే ఉండే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. బడ్జెట్ మొత్తం వ్యవహారాల సమన్వయ బాధ్యతను అనురాధా ఠాకూర్ చూస్తున్నారని పేర్కొంది.
వివరాలు
గత బడ్జెట్ టీమ్‌లో పనిచేసిన వారిలో ఈసారి నలుగురే కొనసాగుతారు
బడ్జెట్‌కు సంబంధించిన విభాగాల్లో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెక్రటరీ కే.మోసెస్ చెల్లై అత్యంత సీనియర్ అధికారి. అయితే ఆయన విభాగానికి బడ్జెట్‌తో నేరుగా పెద్దగా సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. గత బడ్జెట్ టీమ్‌లో పనిచేసిన వారిలో ఈసారి కేవలం నలుగురే కొనసాగుతున్నారని సమాచారం. వారు సీబీడీటీ చైర్మన్ రవి అగర్వాల్,డీపామ్ సెక్రటరీ అరుణిష్ చావ్లా,ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం.నాగరాజు,చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి.అనంత నాగేశ్వరన్. ఇక వ్యయం,ఆదాయం,ఆర్థిక వ్యవహారాల శాఖల కీలక సెక్రటరీలు ఈ వేసవిలోనే తమ పదవులు చేపట్టారు. డిసెంబర్‌లో వివేక్ చతుర్వేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా,బడ్జెట్ డివిజన్‌ను చూసే జాయింట్ సెక్రటరీ వ్యాసన్ ఆర్ తాజాగా తన ప్రస్తుతబాధ్యతల్లోకి వచ్చారు.
వివరాలు
ఎన్నో ఏళ్ల పాటు బడ్జెట్ డివిజన్‌ను నడిపిన అరవింద్ శ్రీవాస్తవ
అయితే ఆయనకు బడ్జెట్ ప్రక్రియపై మంచి అనుభవం ఉందని,గతంలోనూ ఈ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారని అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ సెక్రటరీ అరవింద్ శ్రీవాస్తవ కూడా అనుభవం ఉన్న అధికారి. ప్రధాని కార్యాలయంలో పనిచేసే ముందు, ఎన్నో ఏళ్ల పాటు బడ్జెట్ డివిజన్‌ను ఆయన నడిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదాయ-వ్యయాలతో పాటు, ప్రధాన విధానాలు, సంస్కరణలపై జరిగే వార్షిక చర్చల్లో ఆయన కీలకంగా పాల్గొన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌ను ఏ తేదీన ప్రవేశపెట్టాలన్న అంశంపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశముందని మనీకంట్రోల్‌కు వర్గాలు తెలిపాయి.
వివరాలు
నేడు సమావేశం కానున్న పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ
ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో, అదే రోజున బడ్జెట్‌ను కొనసాగించే ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఆ రోజున లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంతో ఈ సమావేశాలు మొదలవుతాయని వర్గాలు చెబుతున్నాయి.