Bank Scams: రూ.58000 కోట్లు కట్టాలా.. 15 మంది ఆర్థిక నేరగాళ్లపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
దేశం విడిచి పరారైన మొత్తం 15 మంది ఆర్థిక నేరగాళ్లలో 9 మంది భారీ స్థాయి మోసాలకు పాల్పడి ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలను ఎగ్గొట్టారని కేంద్ర మంత్రి వెల్లడించారు. అయితే వీరిలో ఇద్దరు మాత్రమే సింగిల్ టైమ్ సెటిల్‌మెంట్ (ఏకకాల పరిష్కారం - OTS)కోసం బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ 15 మంది చెల్లించాల్సిన అసలు రుణ మొత్తం రూ.25,645 కోట్లు కాగా,ఇప్పటి వరకు వాటిపై వడ్డీ రూ.31,437కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా,యూకో బ్యాంక్,ఇండియన్ బ్యాంక్,పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుతో పాటు మొత్తం 12 ప్రభుత్వ బ్యాంకులకు వీరు చెల్లించాల్సిన బాకీ మొత్తం రూ.58,082 కోట్లుగా ఉందని చెప్పారు.
వివరాలు
తొలి స్థానంలో విజయ్ మాల్యా రూ.11,960 కోట్లు
పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం- 2018 కింద విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తదితరులతో కలిసి మొత్తం 15 మందిని అధికారికంగా ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్లుగా గుర్తించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు వీరి నుంచి సుమారు 33 శాతం మేర అంటే రూ.19,187 కోట్లు రికవరీ చేసినట్లు,ఇంకా రూ.38,895 కోట్లు వసూలు చేయాల్సి ఉందని వివరించారు. అధికంగా రుణాలు తీసుకున్న వారిలో విజయ్ మాల్యా రూ.11,960 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, ఈ మొత్తం ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకున్న అప్పులేనని తెలిపారు. అలాగే నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వద్ద రూ.6,799 కోట్ల అప్పు చేశారని చెప్పారు.
వివరాలు
ఆర్థిక నేరగాళ్లను అడ్డుకునేందుకు కొత్త పాలసీ
ఇక సందేశారా గ్రూప్ పలు అకౌంట్ల ద్వారా రూ.900 నుంచి రూ.1,300 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆర్థిక నేరగాళ్లు దేశాన్ని విడిచి పారిపోవడాన్ని అడ్డుకునేందుకు కొత్త పాలసీ రూపొందించే అంశం ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే, విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన ఖాతాల ద్వారా అత్యధిక రుణాలు తీసుకున్నట్లు తేలిందని వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, మొదటగా రూ.6,848.28 కోట్లుగా ఉన్న రుణం వడ్డీలతో కలిసి రూ.11,960.05 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
వివరాలు
నీరవ్ మోదీ రూ.7,800 కోట్ల రుణాలు
అలాగే విజయ్ మాల్యాకు సంబంధించిన అప్పులపై ఇతర బ్యాంకులు కూడా తమ క్లెయిమ్‌లను ప్రకటించాయని తెలిపారు. మరోవైపు, నీరవ్ మోదీ తన ఫైర్ స్టార్, డైమండ్ గ్రూప్ సంస్థల పేర్లతో సుమారు రూ.7,800 కోట్ల రుణాలు పొందగా, అందులో ఒక్క పీఎన్‌బీ వద్దే రూ.6,799.18 కోట్ల మేర అప్పు ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.