Sun TV shares: తమిళనాడులో విజయ్ ప్రభావం.. సన్ నెట్‌వర్క్ షేర్లు డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అనూహ్యంగా దూసుకురావడం, అధికార పార్టీ డీఎంకే తీవ్రంగా వెనుకబడడం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ముఖ్యంగా సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు గణనీయంగా పతనమయ్యాయి. ఒక దశలో బీఎస్‌ఈలో సన్‌టీవీ షేరు ధర 9.5 శాతం వరకు క్షీణించి రూ.547.55 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటల సమయానికి 6.43 శాతం నష్టంతో రూ.566.40 వద్ద ట్రేడవుతోంది. తమిళనాడులో గత కొన్ని దశాబ్దాలుగా అధికార పీఠం డీఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) మధ్య మారుతూ వస్తోంది.
వివరాలు
మూడో స్థానానికి పరిమితమైన డీఎంకే
అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అనూహ్యంగా ముందుకు వచ్చింది. 100కు పైగా స్థానాల్లో టీవీకే లీడ్‌లో కొనసాగుతోంది. అన్నాడీఎంకే రెండో స్థానంలో ఉండగా, డీఎంకే మూడో స్థానానికి పరిమితమైంది. ఈ రాజకీయ పరిణామాల ప్రభావంతో సన్‌టీవీ షేర్లు క్షీణించాయి. సన్‌టీవీ యజమాని కలానిధి మారన్, డీఎంకే నాయకుడు ఎం.కే స్టాలిన్‌కు సమీప బంధువు కావడం గమనార్హం. ఇక మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఉదయం లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. ప్రారంభంలో భారీగా ఎగసిన బిఎస్ఇ సెన్సెక్స్ఒక దశలో దాదాపు వెయ్యి పాయింట్లు లాభపడినా, అనంతరం సుమారు 700 పాయింట్లు కోల్పోయింది.
వివరాలు
నష్టాల్లో కోటక్ మహీంద్రా, ఐటీసీ షేర్లు
మధ్యాహ్నం 12.50 గంటలకు 319 పాయింట్ల లాభంతో 77,232 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 50 సూచీ 96 పాయింట్ల లాభంతో 24,094 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, లార్సెన్ & టూబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ట్రెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.