Lenskart controversy: వైరల్ పాలసీ షాక్.. ఒక్కరోజులో లెన్స్‌కార్ట్‌కు రూ.4,500 కోట్ల నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత కళ్లద్దాల తయారీ సంస్థ 'లెన్స్‌కార్ట్' తాజాగా పెద్ద వివాదంలో చిక్కుకుంది. కంపెనీకి సంబంధించిన పాత డ్రెస్ కోడ్ పాలసీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం ఒక్కసారిగా ముదిరింది. దీని ప్రభావం కేవలం బ్రాండ్ ఇమేజ్‌పైనే కాకుండా స్టాక్ మార్కెట్ విలువపై కూడా తీవ్రంగా పడింది. సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.4,500 కోట్లకు పైగా క్షీణించడం గమనార్హం.
వివరాలు
వివాదానికి కారణం ఇదే
లెన్స్‌కార్ట్‌కు చెందిన పాత 'స్టైల్ గైడ్' పత్రం ఆన్‌లైన్‌లో బయటకు రావడంతో సమస్య మొదలైంది. ఇందులో ఉద్యోగులు విధి నిర్వహణ సమయంలో బొట్టు (బిందీ), తిలకం వంటి మతపరమైన చిహ్నాలు ధరించకూడదని నిబంధన ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. #BoycottLenskart హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతూ కంపెనీపై విమర్శలు వెల్లువెత్తాయి.
వివరాలు
స్టాక్ మార్కెట్‌పై ప్రభావం
ఈ వివాదం నేరుగా మార్కెట్‌ను తాకింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సోమవారం లెన్స్‌కార్ట్ షేరు సుమారు 5 శాతం పడిపోయి రూ.508.70 కనిష్ట స్థాయికి చేరింది. గతవారం రూ.92,872.20 కోట్లుగా ఉన్న మార్కెట్ విలువ, సోమవారం ఒక దశలో రూ.88,331.48 కోట్లకు పడిపోయింది. అంటే ట్రేడింగ్ సమయంలో సుమారు రూ.4,540.72 కోట్ల నష్టం నమోదైంది. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో షేరు కొంత కోలుకుని రూ.530.60 వద్ద ట్రేడ్ అవ్వగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.92,038.73 కోట్ల వద్ద స్థిరపడింది.
వివరాలు
పీయూష్ బన్సల్ స్పందన
వివాదం తీవ్రరూపం దాల్చడంతో లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు పేయుష్ బన్సల్ స్పందించారు. వైరల్ అవుతున్న పత్రం చాలా పాతదని, అది ప్రస్తుత కంపెనీ విధానాలను ప్రతిబింబించదని స్పష్టం చేశారు. "మా సంస్థలో బొట్టు, తిలకాలతో సహా ఎలాంటి మతపరమైన చిహ్నాలపై నిషేధం లేదు. జరిగిన అపార్థానికి క్షమాపణలు కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
కొత్త గైడ్‌లైన్స్ విడుదల
వివాదానికి తెరదించేందుకు లెన్స్‌కార్ట్ కొత్త 'ఇన్-స్టోర్ స్టైల్ గైడ్'ను విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులు బిందీలు, తిలకాలు, సింధూరం, కలావాలు (చేతి మొలతాడు), మంగళసూత్రాలు ధరించవచ్చు. అలాగే కడాలు, హిజాబ్‌లు, తలపాగాలు (టర్బన్లు) కూడా అనుమతించబడినట్లు కంపెనీ స్పష్టం చేసింది. తమ ఉద్యోగుల మతపరమైన భావాలను గౌరవించడం తమకు ముఖ్యమని వెల్లడించింది. ఈ సంఘటనతో చిన్న తప్పిదం కూడా కార్పొరేట్ సంస్థలపై ఎంతటి ప్రభావం చూపుతుందో మరోసారి స్పష్టమైంది. అయితే పీయూష్ బన్సల్ వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పడంతో ప్రస్తుతం పరిస్థితి క్రమంగా చల్లబడుతున్నట్టు కనిపిస్తోంది.