Loading...
Warren Buffett: వారెన్ బఫెట్ రూ.49 వేల కోట్ల విరాళం.. నాలుగు సంస్థలకు బెర్క్‌షైర్ షేర్లు
వారెన్ బఫెట్ రూ.49 వేల కోట్ల విరాళం.. నాలుగు సంస్థలకు బెర్క్‌షైర్ షేర్లు

Warren Buffett: వారెన్ బఫెట్ రూ.49 వేల కోట్ల విరాళం.. నాలుగు సంస్థలకు బెర్క్‌షైర్ షేర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ బిలియనీర్, పెట్టుబడుల దిగ్గజం వారెన్ బఫెట్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సుమారు 5.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.49 వేల కోట్లకు పైగా) విలువైన బెర్క్‌షైర్ హాత్‌వే (Berkshire Hathaway) షేర్లను నాలుగు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆయన చేసిన విరాళాల విలువ గణనీయంగా పెరిగింది. బఫెట్ తన వద్ద ఉన్న 6,150 క్లాస్-ఏ షేర్లను 92,25,000 క్లాస్-బీ షేర్లుగా మార్చి, వాటన్నింటినీ విరాళంగా అందించారు. ఇందులో సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్‌కు 36,90,000 షేర్లు కేటాయించారు. మిగిలిన షేర్లలో షెర్వుడ్ ఫౌండేషన్,హోవార్డ్ జి. బఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్‌లకు ఒక్కో సంస్థకు 18,45,000 షేర్ల చొప్పున ఇచ్చారు.

వివరాలు 

దయ చూపడానికి ఖర్చు లేదు.. కానీ దాని విలువ వెలకట్టలేనిది: బఫెట్

ఈ మూడు సంస్థలను బఫెట్ పిల్లలు సూసీ, హోవార్డ్, పీటర్ నిర్వహిస్తున్నారు.

ప్రతి ఏడాది థ్యాంక్స్‌గివింగ్ సందర్భంగా రాసే లేఖలో బఫెట్ తన సేవాగుణం గురించి మరోసారి ప్రస్తావించారు.

ఇతరుల పట్ల దయ చూపడానికి ఎలాంటి ఖర్చు ఉండదని, అయితే దాని విలువ మాత్రం వెలకట్టలేనిదని పేర్కొన్నారు.

అంతేకాదు.. దయాగుణం నిరంతరం పెరుగుతుందని, తాను, తన దివంగత వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కలిసి గతంలో పెట్టుబడులు పెట్టిన వాటికంటే కూడా ఇది మెరుగైన ఫలితాలను ఇస్తుందని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

ఎస్‌ అండ్‌ పీ 500 కంటే మెరుగైన ప్రదర్శన

బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే షేర్లు ఈ ఏడాది అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నాయి.

నాలుగో త్రైమాసికం ప్రారంభమైనప్పటి నుంచి ఈ షేర్ల విలువ 19 శాతానికి పైగా పెరిగింది.

ఈ ఏడాది ఎస్‌ అండ్‌ పీ 500 సూచీతో పోలిస్తే బెర్క్‌షైర్ షేర్లు సుమారు 7.5 శాతం పాయింట్ల మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి.

భారీ మొత్తంలో షేర్లను విరాళంగా ఇచ్చినప్పటికీ బఫెట్ వద్ద ఇంకా గణనీయమైన సంఖ్యలో క్లాస్-ఏ షేర్లు ఉన్నాయి.

వీటి విలువ సుమారు 162 బిలియన్ డాలర్లుగా ఉంది. సంస్థపై, దాని ప్రస్తుత సీఈఓ గ్రెగ్ అబెల్ నాయకత్వంపై తనకు ఉన్న నమ్మకాన్ని ఇది తెలియజేస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

మిగిలిన షేర్లన్నీ ఆ నాలుగు సంస్థలకే విరాళం

తన వద్ద మిగిలి ఉన్న బెర్క్‌షైర్ హాత్‌వే షేర్లన్నింటినీ కూడా ఈ నాలుగు స్వచ్ఛంద సంస్థలకే విరాళంగా ఇవ్వనున్నట్లు బఫెట్ ఇప్పటికే ప్రకటించారు.

ప్రతి ఏడాది ఈ సంస్థలు అందించే సేవా కార్యక్రమాలకు ఇచ్చే గ్రాంట్ల మొత్తాన్ని పెంచాలన్నది ఆయన లక్ష్యం.

తన పిల్లల సేవా కార్యక్రమాలపై కూడా బఫెట్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

తన పిల్లలు ఎన్నో ఏళ్లుగా అర్హులైన వారికి, అవసరమైన సేవా కార్యక్రమాలకు ఆలోచనాత్మకంగా విరాళాలు అందిస్తున్నారని తెలిపారు.

వారి సామర్థ్యంపై, నిబద్ధతపై తనకు వంద శాతం నమ్మకం ఉందని పేర్కొన్నారు.

ADVERTISEMENT