LOADING...
EPF: యూపీఐ ద్వారా పీఎఫ్‌ ఉపసంహరణకు మార్గం.. కొత్త ఈపీఎఫ్‌ఓ యాప్‌ సిద్ధం
యూపీఐ ద్వారా పీఎఫ్‌ ఉపసంహరణకు మార్గం.. కొత్త ఈపీఎఫ్‌ఓ యాప్‌ సిద్ధం

EPF: యూపీఐ ద్వారా పీఎఫ్‌ ఉపసంహరణకు మార్గం.. కొత్త ఈపీఎఫ్‌ఓ యాప్‌ సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌)చందాదారులకు త్వరలోనే కీలక సౌకర్యం అందుబాటులోకి రానుంది. తమ ఈపీఎఫ్‌ ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని యూపీఐ పేమెంట్‌ గేట్‌వే ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఉపసంహరించుకునే అవకాశం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కల్పించనున్నారు. ఈ మేరకు సరికొత్త ఈపీఎఫ్‌ఓ మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తంలో కొంత భాగాన్ని మినహాయించి, మెజారిటీ మొత్తాన్ని యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకునే విధానంపై కార్మిక శాఖ ప్రస్తుతం పని చేస్తోంది. కొత్తగా తీసుకురానున్న ఈపీఎఫ్‌ఓ మొబైల్‌ యాప్‌ ద్వారా సభ్యులు యూపీఐ సాయంతో నిధులను ఉపసంహరించుకోవడంతో పాటు, పాస్‌బుక్‌ బ్యాలెన్స్‌ వంటి ఇతర సేవలను కూడా పొందవచ్చని అధికారులు తెలిపారు.

Details

ఈ ఏడాది ఏప్రిల్ లో లాంచ్ చేసేందుకు సిద్ధం

ఈ కొత్త యాప్‌లో తమ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసేందుకు ఎంత మేరకు ఈపీఎఫ్‌ మొత్తం అందుబాటులో ఉందో అనే పూర్తి వివరాలను చందాదారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. లావాదేవీలు పూర్తిచేయడానికి, నిధులు భద్రంగా బ్యాంకు ఖాతాలకు చేరేందుకు లింక్‌ చేసిన యూపీఐ పిన్‌ను వినియోగించాల్సి ఉంటుంది. సేవలను మరింత మెరుగుపరచడం, సాంకేతిక లోపాలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ 100 డమ్మీ ఖాతాలతో ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్‌ పూర్తైన అనంతరం, ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో కొత్త మొబైల్‌ యాప్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు కార్మిక శాఖ సన్నాహాలు చేస్తోంది.

Advertisement