LOADING...
LIC: స్వతంత్య్రగానే పెట్టుబడులు పెట్టాం.. స్పష్టతనిచ్చిన ఎల్ఐసీ
స్వతంత్య్రగానే పెట్టుబడులు పెట్టాం.. స్పష్టతనిచ్చిన ఎల్ఐసీ

LIC: స్వతంత్య్రగానే పెట్టుబడులు పెట్టాం.. స్పష్టతనిచ్చిన ఎల్ఐసీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

అదానీ గ్రూప్‌ కంపెనీల్లో తమ పెట్టుబడులపై ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) స్పష్టతనిచ్చింది. ఈ పెట్టుబడులు పూర్తిగా స్వతంత్ర నిర్ణయంతోనే చేసినవని, ఇందులో ఎలాంటి ప్రభుత్వ ఒత్తిడి లేదా హస్తం లేదని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. ఇటీవల వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రచురించిన కథనంలో ఎల్‌ఐసీ అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు ప్రభుత్వ ప్రణాళిక మేరకే పెట్టిందని చేసిన ఆరోపణల నేపథ్యంలో సంస్థ ఈ వివరణ ఇచ్చింది. శనివారం ఎల్‌ఐసీ తన అధికారిక ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం ప్రకారం, అదానీ గ్రూప్‌ అప్పులు, అంతర్జాతీయ ఒత్తిళ్ల నడుమ ఎల్‌ఐసీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందని పేర్కొంది.

Details

బోర్డు సభ్యుల అమోదంతోనే నిర్ణయాలు

దీనిపై ఎల్‌ఐసీ స్పందిస్తూ, ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పింది. సంస్థ పెట్టుబడులపై ఎల్లప్పుడూ తన బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొంది. ఎల్‌ఐసీ తెలిపిన వివరాల ప్రకారం, పెట్టుబడుల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇతర ప్రభుత్వ విభాగాల గానీ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సంస్థ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తోందని, ఇలాంటి బాధ్యతాయుత సంస్థపై నిరాధార ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరించింది. దేశంలోని టాప్‌-500 కంపెనీల్లో ఎల్‌ఐసీకి పెట్టుబడులు ఉన్నాయి.

Details

పదేళ్లలో దాదాపు 10 రెట్లు వృద్ధి

2014లో ఈ పెట్టుబడుల మొత్తం రూ.1.56 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అది రూ.15.6 లక్షల కోట్లకు పెరిగింది. అంటే పదేళ్లలో దాదాపు 10 రెట్లు వృద్ధి చెందింది. ఎల్‌ఐసీ పెట్టుబడుల వివరాల ప్రకారం — అదానీ గ్రూప్‌లో 4 శాతం వాటా (రూ.60,000 కోట్లు), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 6.94 శాతం (రూ.1.34 లక్షల కోట్లు), ఐటీసీలో 15.86 శాతం (రూ.82,800 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 4.89 శాతం (రూ.64,725 కోట్లు), ఎస్‌బీఐలో 9.50 శాతం (రూ.79,361 కోట్లు) పెట్టుబడులున్నాయి. అదనంగా, టాటా గ్రూప్‌కు చెందిన టీసీఎస్‌లోనే 5.02 శాతం వాటా, దాదాపు రూ.5.7 లక్షల కోట్ల పెట్టుబడితో ఎల్‌ఐసీకి అత్యంత పెద్ద వాటా ఉంది.