భారత్‌లో కచ్చితంగా ఫ్యాక్టరీని నెలకొల్పుతాం: టెస్లా అధినేత ఎలాన్ మస్క్
ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ లో ఫ్యాక్టరీ నెలకొల్పే అవకాశాల పై మాట్లాడుతూ తాము కచ్చితంగా భారత్ కు వస్తామని తెలియజేశారు. భారత్ లో ఎక్కడ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామనే విషయం పై ఈ ఏడాది చివరిలోగా నిర్ణయం తీసుకుంటామని మంగళవారం అమెరికాలో స్పష్టం చేశారు. ఆపిల్, టెస్లా వంటి కంపెనీలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. భారత్ లో ప్లాంట్ నెలకొల్పే విషయంపై టెస్లా ఎగ్జిక్యూటివ్ లు గతవారమే కేంద్ర అధికారులతో ఢిల్లీలో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
భారత్ లో అడుగుపెట్టేందుకు టెస్లా ముందంజ
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించే ఆలోచన ఉంటేనే ప్లాంట్ స్థాపించాలని కేంద్రం ఇదివరకే టెస్లాకు సలహా ఇచ్చినట్లు సమాచారం. అయితే మొదట కార్లను విక్రయించడం, సర్వీస్ కు అనుమతిస్తేనే తాము ప్లాంట్ నెలకొల్పే విషయంపై ఆలోచిస్తామని, అయితే అప్పటిదాకా మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని స్థాపించమని మాస్క్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుతున్న నేపథ్యంలో భారత్ మార్కెట్లోకి అడుగుపెడితే తమకు ప్రయోజనకరంగా ఉంటుందని టెస్లా ఆలోచిస్తోందట. టెస్లా సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థలకు కూడా యజమానిగా ఉన్నాడు.