LOADING...
GDP: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారత వృద్ధి 7.1%కే పరిమితమయ్యే అవకాశం: క్రిసిల్
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారత వృద్ధి 7.1%కే పరిమితమయ్యే అవకాశం: క్రిసిల్

GDP: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారత వృద్ధి 7.1%కే పరిమితమయ్యే అవకాశం: క్రిసిల్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే భారత ఆర్థిక వృద్ధి అంచనాలపై ప్రభావం పడే అవకాశం ఉందని క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ పేర్కొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా ముడి చమురు, ఇతర కమొడిటీ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి 7.1 శాతం వరకు మాత్రమే ఉండొచ్చని క్రిసిల్‌ తన తాజా నివేదికలో తెలిపింది. అయినప్పటికీ ఇది ఆరోగ్యకరమైన వృద్ధి రేటే అని సంస్థ అభిప్రాయపడింది. ప్రైవేటు వినియోగం బలంగా కొనసాగడం, ప్రైవేటు రంగ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభించే అవకాశముందని నివేదికలో పేర్కొంది.

వివరాలు 

ద్రవ్యోల్బణం పెరుగుదల అంచనా

రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 2026-27లో 4.3 శాతానికి చేరే అవకాశం ఉందని క్రిసిల్‌ అంచనా వేసింది. అయితే 2025-26లో ఇది 2.5 శాతంగానే ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న తక్కువ స్థాయి నుంచి ద్రవ్యోల్బణం మళ్లీ సాధారణ స్థాయికి చేరే అవకాశముందని నివేదికలో తెలిపింది.

వివరాలు 

చమురు కంపెనీలపై మార్జిన్ల ఒత్తిడి

భారత ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు అయిన ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌పై ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం పడుతోంది. దేశం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడడం, అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల దేశీయంగా ఇంధన ధరలను వినియోగదారులపై పూర్తిగా మోపడం కష్టమవుతోంది. దీంతో ఆయా కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు తెలిపాయి. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌, మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌, ఫిచ్‌ రేటింగ్స్‌ విడుదల చేసిన వేర్వేరు నివేదికల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించాయి.

Advertisement

వివరాలు 

దిగుమతులపై భారీగా ఆధారపడటం

భారత్‌ తన ముడి చమురు అవసరాల్లో సుమారు 88 శాతం, సహజ వాయువు అవసరాల్లో దాదాపు సగం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో హర్మూజ్‌ జలసంధి ద్వారా వచ్చే సరఫరా 30 నుంచి 55 శాతం వరకు ఉంటోంది. మరోవైపు దేశంలో ఉన్న వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు కేవలం 10 రోజుల వినియోగానికే సరిపోతాయి. అదనంగా ఉన్న వాణిజ్య నిల్వలు 65 రోజుల వరకు మాత్రమే అవసరాలను తీర్చగలవు. ఈ పరిస్థితుల వల్ల చమురు మార్కెటింగ్‌ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోందని రేటింగ్‌ ఏజెన్సీలు పేర్కొన్నాయి.

Advertisement

వివరాలు 

సరఫరా అంతరాయం అయితే క్రెడిట్‌ ప్రొఫైల్‌పై ప్రభావం

ప్రభుత్వం నుంచి బలమైన మద్దతు ఉన్నప్పటికీ,చమురు లేదా ఎల్‌ఎన్‌జీ సరఫరాలో అంతరాయాలు ఎక్కువకాలం కొనసాగితే ఆయా కంపెనీల క్రెడిట్‌ ప్రొఫైల్‌పై తాత్కాలిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. ముడి పదార్థాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెటింగ్‌ మార్జిన్లు తగ్గే ప్రమాదం ఉందని మూడీస్‌ అంచనా వేసింది. అలాగే ప్రభుత్వ ఆదేశాలు, అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా మార్జిన్లు తగ్గే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ కూడా పేర్కొంది. ఇదిలా ఉండగా, రిలయన్స్‌ వంటి ప్రైవేటు కంపెనీలు మిశ్రమ ప్రభావాలను ఎదుర్కొనే అవకాశముంది. ప్రారంభ దశలో నిల్వల కారణంగా కొంత ప్రయోజనం పొందినా, సరఫరా అంతరాయాలు కొనసాగితే అవి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

Advertisement