LOADING...
MRM Portal: ఎంఆర్ఎం పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో కోల్పోయిన డబ్బును తిరిగి పొందడం ఎలా?
ఎంఆర్ఎం పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో కోల్పోయిన డబ్బును తిరిగి పొందడం ఎలా?

MRM Portal: ఎంఆర్ఎం పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో కోల్పోయిన డబ్బును తిరిగి పొందడం ఎలా?

వ్రాసిన వారు Moogati Shabari
Jun 14, 2026
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓటీపీ మోసాలు, "డిజిటల్ అరెస్ట్" పేరుతో జరుగుతున్న మోసాలు ప్రజలను భారీగా నష్టపరుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సైబర్ మోసాల బారిన పడిన వారికి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్తగా మొబైల్ రిస్టోరేషన్ మాడ్యూల్ (MRM) అనే ప్రత్యేక సబ్-పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వేదిక ద్వారా బాధితులు తమ ఇళ్ల నుంచే రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యం పొందుతున్నారు.

వివరాలు

ఎంఆర్ఎం పోర్టల్ అంటే ఏమిటి?

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఈ MRM పోర్టల్‌ను రూపొందించింది. సైబర్ మోసాల వల్ల నష్టపోయిన వ్యక్తులు తమ డబ్బును తిరిగి పొందే ప్రక్రియను సులభతరం చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇంతకుముందు రీఫండ్ కోసం బాధితులు పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు పలుమార్లు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎంఆర్ఎం పోర్టల్ ద్వారా ఆ ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేసే అవకాశం లభిస్తోంది.

వివరాలు

రీఫండ్ పొందడానికి అవసరమైన అర్హతలు..

MRM పోర్టల్ ద్వారా డబ్బు తిరిగి పొందాలంటే కింది రెండు నిబంధనలు తప్పనిసరిగా ఉండాలి. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు నమోదు చేయాలి. మోసగాడి బ్యాంక్ ఖాతాలో ఉన్న సంబంధిత మొత్తాన్ని అధికారులు ఫ్రీజ్ చేసి ఉండాలి. ఈ రెండు అర్హతలు నెరవేరిన తర్వాత మాత్రమే రీఫండ్ ప్రక్రియ కొనసాగుతుంది.

Advertisement

వివరాలు

రీఫండ్ ప్రక్రియను మూడు విభాగాలుగా విభజించారు.. 

1. రూ.50,000 కంటే తక్కువ మొత్తం ఫ్రీజ్ అయినప్పుడు : మోసగాడి ఖాతాలో నిలిపివేసిన మొత్తం రూ.50,000 లోపుగా ఉంటే: FIR నమోదు అవసరం లేదు. కోర్టు ఆదేశాలు అవసరం ఉండవు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నేరుగా రీఫండ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2. మొత్తం రూ.50,000 కంటే ఎక్కువ అయినా, ఒక్క ఖాతాలో మాత్రం అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఫ్రీజ్ చేసిన మొత్తం కలిపి రూ.50,000 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ, అది వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో ఉండి, ఏ ఒక్క ఖాతాలోనూ రూ.50,000 మించకపోతే FIR నమోదు చేయాల్సిన అవసరం లేదు. కోర్టు ఉత్తర్వులు అవసరం ఉండవు. సాధారణ రీఫండ్ విధానం ప్రకారమే డబ్బు తిరిగి పొందవచ్చు.

Advertisement

వివరాలు

డబ్బు ఫ్రీజ్ అయితే..

3. ఒకే బ్యాంక్ ఖాతాలో రూ.50,000 కంటే ఎక్కువ మొత్తం ఉన్నప్పుడు ఒకే ఖాతాలో రూ.50,000కు పైగా డబ్బు ఫ్రీజ్ అయితే: FIR తప్పనిసరిగా నమోదు చేయాలి. కోర్టు నుంచి అనుమతి ఉత్తర్వులు తీసుకోవాలి. ఆ పత్రాలను MRM పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అనంతరం పోలీసు అధికారులు అవసరమైన ఇండెమ్నిటీ బాండ్, నోటీసులు వంటి పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. సంబంధిత బ్యాంకు నేరుగా బాధితుడి ఖాతాలో డబ్బును జమ చేస్తుంది.

వివరాలు

ఎంఆర్ఎం పోర్టల్‌లో రీఫండ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

దరఖాస్తు ప్రారంభించే ముందు ఈ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి: బ్యాంక్ ఖాతా సంఖ్య పాన్ కార్డు డిజిటల్ కాపీ NCRP ద్వారా జారీ చేసిన 14 అంకెల ఫిర్యాదు నంబర్ NCRPలో నమోదు చేసిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. దరఖాస్తు చేసే విధానం స్టెప్ 1: MRM పోర్టల్‌ను ఓపెన్ చేయండి. MRM Portal: https://mrm-ncrp.mha.gov.in/public-info స్టెప్ 2: "Citizen Login" ఎంపికపై క్లిక్ చేయండి. స్టెప్ 3: NCRPలో నమోదు చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. స్టెప్ 4: మీ మొబైల్‌కు వచ్చిన OTPను నమోదు చేసి లాగిన్ అవ్వండి. స్టెప్ 5: "Raise Refund Request" విభాగంలోకి వెళ్లి 14 అంకెల ఫిర్యాదు IDని నమోదు చేయండి.

వివరాలు

రిక్వెస్ట్ స్టేటస్‌ను ఎలా తెలుసుకోవాలి?

స్టెప్ 6: పాన్ కార్డు డిజిటల్ కాపీని అప్‌లోడ్ చేయండి. స్టెప్ 7: బ్యాంక్ ఖాతా నంబర్‌తో పాటు IFSC కోడ్ వివరాలను నమోదు చేయండి. స్టెప్ 8: అవసరమైతే కోర్టు ఉత్తర్వుల డిజిటల్ కాపీని అప్‌లోడ్ చేయండి. స్టెప్ 9: డిక్లరేషన్‌కు అంగీకరిస్తూ చెక్‌బాక్స్‌ను ఎంపిక చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి. దరఖాస్తు విజయవంతంగా పూర్తయిన తర్వాత MRM పోర్టల్ "MR2026"తో ప్రారంభమయ్యే ప్రత్యేక Request IDని జారీ చేస్తుంది. ఈ ID సహాయంతో మీ రీఫండ్ దరఖాస్తు ప్రస్తుతం ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.

Advertisement