Loading...
#NewsBytesExplainer:: అమెరికా కొత్త టారిఫ్ ప్రతిపాదన.. భారత ఎగుమతులపై ఎంత భారం పడనుంది?
అమెరికా కొత్త టారిఫ్ ప్రతిపాదన.. భారత ఎగుమతులపై ఎంత భారం పడనుంది?

#NewsBytesExplainer:: అమెరికా కొత్త టారిఫ్ ప్రతిపాదన.. భారత ఎగుమతులపై ఎంత భారం పడనుంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మరోసారి భారత్‌పై దిగుమతి సుంకాల విషయంలో కీలక ప్రతిపాదన చేసింది. భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై గరిష్ఠంగా 25 శాతం వరకు సుంకాలు విధించాలని బుధవారం ప్రకటించింది. అయితే, భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఈ సుంకాన్ని 17 శాతానికి తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) తయారీ రంగంలో అవసరానికి మించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్న దేశాల జాబితాలో భారత్‌ను కూడా చేర్చింది. మొత్తం 14దేశాలపై ఈ పరిశీలన చేపట్టింది.అయితే, ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదనలు మాత్రమే. తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఏయే వస్తువులపై సుంకాలు వర్తిస్తాయి?భారత్ అమెరికాతో ఒప్పందం చేసుకుంటుందా? అనే అంశాలపై భారత ఎగుమతులపై ప్రభావం ఆధారపడి ఉంటుంది.

వివరాలు 

భారత్‌పై అమెరికా ప్రతిపాదించిన సుంకాలెంత?

భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని సుంకాలను మినహాయించి గరిష్ఠంగా 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలని USTR ప్రతిపాదించింది.

అయితే, అమెరికాతో పరస్పర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఈ రేటును 17 శాతానికి తగ్గించనున్నట్లు పేర్కొంది.

భారత్, అమెరికా మధ్య గత ఫిబ్రవరిలో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఒక అవగాహన కుదిరింది.

ఇందులో 18 శాతం సుంకం ఉండేలా ప్రతిపాదించారు. అయితే, ఇప్పటివరకు ఇరు దేశాలు తుది ఒప్పందంపై సంతకాలు చేయలేదు.

వివరాలు 

భారత ఎగుమతిదారులపై అదనపు భారం ఎంత?

వేరే విచారణలో భాగంగా జులై 24 నుంచి భారత్ నుంచి వచ్చే చాలా వస్తువులపై అమెరికా ఇప్పటికే 10 శాతం అదనపు సుంకం విధిస్తోంది.

తాజాగా ప్రతిపాదించిన సుంకం దీనికి అదనంగా వర్తించదని అమెరికా స్పష్టం చేసింది.

ఇప్పటికే అమల్లో ఉన్న సెక్షన్ 301 సుంకాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొత్త సుంకం అమలవుతుందని తెలిపింది.

అంటే, ప్రస్తుతం ఉన్న సుంకం, కొత్తగా ప్రతిపాదించిన సుంకం రెండింటిలో ఏది ఎక్కువైతే అదే వర్తిస్తుంది.

దీంతో భారత్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటే ప్రస్తుత రేటుతో పోలిస్తే మరో 7 శాతం పాయింట్ల భారం పడుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

భారత ఎగుమతిదారులపై అదనపు భారం ఎంత?

ఒప్పందం కుదరకపోతే ఈ పెరుగుదల 15 శాతం పాయింట్ల వరకు ఉండొచ్చు.

అయితే, జాతీయ భద్రతా కారణాలతో అమెరికా ఇప్పటికే సెక్షన్ 232 కింద సుంకాలు విధిస్తున్న వస్తువులకు ఈ ప్రతిపాదన నుంచి మినహాయింపు ఉంది.

వీటిలో ఉక్కు, అల్యూమినియం, రాగి, కార్లు, ఆటో విడిభాగాలు, భారీ వాహనాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తులపై ఇప్పటికే ఉన్న సుంకాలే కొనసాగుతాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఏ వస్తువులకు మినహాయింపు? దేనిపై ప్రభావం?

అమెరికా విడుదల చేసిన మినహాయింపుల జాబితాను బట్టి ఏయే వస్తువులకు సుంకాల నుంచి ఊరట లభిస్తుందో నిర్ణయిస్తారు.

2025లో అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువను పరిశీలిస్తే.. అత్యధికంగా దిగుమతి చేసుకున్న రెండు ప్రధాన విభాగాలకు మినహాయింపు లభిస్తోంది.

అయితే, ఎక్కువ మందికి ఉపాధి కల్పించే కొన్ని పరిశ్రమలపై మాత్రం సుంకాల ప్రభావం పడే అవకాశం ఉంది.

భారత్ నుంచి ఎగుమతి అయ్యే వైద్య పరికరాలను కూడా అమెరికా సమస్యాత్మక రంగాల్లో ఒకటిగా పేర్కొంది.

వీటికి కూడా మినహాయింపు జాబితాలో చోటు దక్కలేదు.

అలాగే, సెక్షన్ 232 పరిధిలోకి వచ్చే వస్తువులు మినహా చాలా ఇంజినీరింగ్ ఉత్పత్తులపైనా సుంకాల ప్రభావం ఉండొచ్చు.

వివరాలు 

ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి ఏంటి?

అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుని 17 శాతం సుంకాన్ని సాధిస్తే.. కొన్ని కీలక ఎగుమతి రంగాల్లో భారత్‌కు ఇతర ఆసియా దేశాల కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది.

దుస్తులు, వస్త్ర పరిశ్రమలో బంగ్లాదేశ్, కంబోడియాలపై 18 శాతం సుంకం ప్రతిపాదించగా.. వియత్నాంకు ఒప్పందం కుదిరితే 20 శాతం, ఒప్పందం లేకపోతే గరిష్ఠంగా 35 శాతం వరకు విధించే అవకాశం ఉంది.

రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల విషయంలో ఇండోనేసియా, థాయ్‌లాండ్‌పై 18 శాతం, వియత్నాంపై 20 శాతం సుంకం ప్రతిపాదించారు.

సౌర విద్యుత్ ఉత్పత్తులకు సంబంధించిన ఎగుమతులపై కంబోడియా, మలేషియా, థాయ్‌లాండ్‌కు 18 శాతం సుంకం ఉండనుంది.

వివరాలు 

ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి ఏంటి?

అయితే, భారత్ ఒప్పందం కుదుర్చుకోకపోతే గరిష్ఠంగా 25 శాతం సుంకం చెల్లించాల్సి రావొచ్చు.

ఇదే రేటు కంబోడియా, ఇండోనేసియా, మలేషియా, థాయ్‌లాండ్‌లకూ ప్రతిపాదించారు.

యూరోపియన్ యూనియన్, జపాన్, స్విట్జర్లాండ్‌లకు ఇప్పటికే ఉన్న సాధారణ దిగుమతి సుంకాలతో కలిపి 15 శాతం సుంకం ఉండనుంది.

ఇది గరిష్ఠంగా 20 శాతానికి చేరవచ్చు. దక్షిణ కొరియా, తైవాన్‌కు 15 శాతం సుంకం ప్రతిపాదించగా.. గరిష్ఠ పరిమితి 25 శాతంగా ఉంది.

చైనాకు ఇప్పటికే 2018 నుంచి అమల్లో ఉన్న సుంకాలతో పాటు 20 శాతం అదనపు భారం ఉండనుంది. మొత్తం సుంకాలు గరిష్ఠంగా 40 శాతం వరకు చేరవచ్చు.

వివరాలు 

17 శాతం సుంకం పొందాలంటే భారత్ ఏం చేయాలి?

అమెరికా విచారణలో గుర్తించిన అంశాలకు పరిష్కారం చూపేలా భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఉండాలని USTR స్పష్టం చేసింది.

ఈ విచారణలో భారత్‌కు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించింది.

మేక్ ఇన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) వంటి పారిశ్రామిక కార్యక్రమాలు, కార్మికుల హక్కులు, రుణాల కేటాయింపులో ప్రభుత్వ జోక్యం, మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ఉన్న అడ్డంకులు, చైనా నుంచి దిగుమతులు, పెట్టుబడులు వంటి అంశాలను పరిశీలనలో చేర్చింది.

తుది ఒప్పందం కుదిరిన తర్వాత సుంకాల రేటులో ఎలాంటి మార్పులు చేయవచ్చనే అంశంపై కూడా USTR ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది.

ప్రతిపాదించిన సుంకాలు పరస్పర వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా ఉండేలా రూపొందించినట్లు అమెరికా సీనియర్ వాణిజ్య అధికారి తెలిపారు.

వివరాలు 

17 శాతం సుంకం పొందాలంటే భారత్ ఏం చేయాలి?

అయితే, అమెరికా చేసిన ఆరోపణలను భారత్ అంగీకరించడం లేదు.

మేక్ ఇన్ ఇండియా, PLI పథకాల ఉద్దేశం దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడం, కీలక ఉత్పత్తుల కోసం కొన్ని దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమేనని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పథకాలను డిమాండ్‌తో సంబంధం లేకుండా తయారీ సామర్థ్యాన్ని పెంచే చర్యలుగా చూడకూడదని USTRకు సమర్పించిన అభిప్రాయాల్లో పేర్కొంది.

వచ్చే నెలలో ఫ్లోరిడాలో జరగనున్న జీ20 దేశాల నేతల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగే అవకాశముంది.

వివరాలు 

తదుపరి ప్రక్రియ ఎప్పుడు?

ఈ ప్రతిపాదనపై అమెరికా తదుపరి చర్యలకు సంబంధించి కొన్ని తేదీలను ప్రకటించింది.

2027 జనవరి 5లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా సమర్పించాలి.

విచారణలో పాల్గొనాలనుకునేవారు కూడా అదే తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

జనవరి 25 నుంచి వాషింగ్టన్‌లోని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్‌లో బహిరంగ విచారణలు ప్రారంభం కానున్నాయి.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత USTR అందిన అభిప్రాయాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది.

వివరాలు 

తదుపరి ప్రక్రియ ఎప్పుడు?

జనవరి కంటే ముందుగా ఈ సుంకాలు అమల్లోకి వచ్చే అవకాశం లేదని అమెరికా అధికారి తెలిపారు.

అలాగే, వస్త్రాలు, దుస్తుల దిగుమతుల్లో కొంత పరిమాణానికి తక్కువ సుంకంతో అమెరికా మార్కెట్‌లోకి అనుమతించే విధానంపై కూడా USTR అభిప్రాయాలను కోరుతోంది.

ఇది భారత్ నుంచి దుస్తులు, గృహ వినియోగ వస్త్రాలు ఎగుమతి చేసే సంస్థలకు కీలకంగా మారనుంది.

అంతేకాకుండా, తయారీ రంగంలో అధిక ఉత్పత్తి సామర్థ్యంపై పలు దేశాలు కలిసి ఒక ఉమ్మడి ఒప్పందం చేసుకోవాలా? అనే అంశంపైనా అమెరికా అభిప్రాయాలు సేకరిస్తోంది.

ADVERTISEMENT