Sundar Pichai: గూగుల్‌లో ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి.. సుందర్ పిచాయ్ ఇచ్చిన సూచనలివే!
ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీల్లో గూగుల్ ఒకటి. అందులో ఉద్యోగం చేయాలని అనేక మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కల. కానీ గూగుల్‌లో జాబ్ సంపాదించాలంటే ఎలాంటి నైపుణ్యాలు అవసరం? ఆ సంస్థలో ఉద్యోగం ఎలా పొందాలి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన అనుభవాలను పంచుకున్నారు. గూగుల్ కొత్త నియామకాల్లో ప్రధానంగా ఇంజనీరింగ్ రోల్స్‌లో ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి సాంకేతిక నైపుణ్యం, ఎడాప్టబిలిటీని ప్రధానంగా చూస్తుందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. శరవేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో అభివృద్ధి చెందగల సూపర్‌స్టార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కోసం గూగుల్ ఎల్లప్పుడూ అన్వేషిస్తుందని చెప్పారు.
గూగుల్ లో ఉద్యోగం పొందాలంటే సవాళ్లతో కూడుకున్న పని
గూగుల్ వర్క్ కల్చర్ క్రియేటివిటీ, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించేలా ఉంటుందని పిచాయ్ తెలిపారు. కేఫ్‌లో అనుకోకుండా జరిగే సంభాషణలు క్రమంగా ఉత్తేజకరమైన ప్రాజెక్టులకు దారి తీసిన సందర్భాలను పిచాయ్ గుర్తుచేశారు. 2024 జూన్ నాటికి గూగుల్ 1,79,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉందని, గూగుల్ ఆఫర్ చేసిన ఉద్యోగ అవకాశాలను దాదాపు 90% మంది అభ్యర్థులు అంగీకరించినట్లు పిచాయ్ వెల్లడించారు. టెక్ పరిశ్రమలో నియామకాల మందగమనం ఉన్నప్పటికీ, గూగుల్‌లో ఉద్యోగం పొందడం సవాళ్లతో కూడినప్పటికీ అది ఒక "ప్రతిష్ఠాత్మక విజయం"గా అభివర్ణించారు.
ఇంటర్వ్యూలకు బాగా సిద్ధం కావాలి
గూగుల్ మాజీ రిక్రూటర్ నోలన్ చర్చ్, గూగుల్ నియామక ప్రక్రియపై పలు సూచనలు చేశారు. గూగుల్ విలువలు, మిషన్‌ను అర్థం చేసుకోవడం, ఇంటర్వ్యూలకు బాగా సిద్ధం కావడం ముఖ్యమని నోలన్ అభ్యర్థులకు సలహా ఇచ్చారు. జీతంపై చర్చలలో రియలిస్టిక్‌గా ఉండాలని సూచించారు. ఒరిజినల్ ఆఫర్ కంటే 40%-100% ఎక్కువ అడిగితే రిక్రూట్‌మెంట్ టీమ్‌కు అది రెడ్ అలర్ట్ అవుతుంది. సరైన రీసెర్చ్ లేకుండా ఎక్కువ జీతం అడగడం ఆఫర్ రద్దు కావడానికి కారణమవుతుందని నోలన్ చర్చ్ అభిప్రాయపడ్డారు.