Global Gold Reserves: ప్రపంచ బంగారు రారాజులు ఎవరంటే? టాప్-10లో భారత్ స్థానం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, ఆర్థిక అనిశ్చితి మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో కొన్ని దేశాలు నిశ్శబ్దంగా తమ ఖజానాలను బంగారంతో నింపుకుంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ మాంద్యం భయాల మధ్య ఈ బంగారు పోటీ కేవలం పెట్టుబడుల కోసమా? లేక రాబోయే పెద్ద సంఘర్షణలకు ముందస్తు సన్నాహమా? అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఎవరి వద్ద ఉన్నాయి? ఈ రేసులో భారత్ స్థానం ఎక్కడ? అనే అంశాలను ఈ స్టోరీలో పరిశీలిద్దాం.
Details
ప్రపంచంలో అత్యధిక బంగారం ఎవరి వద్ద ఉంది?
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గణాంకాల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వల దేశంగా కొనసాగుతోంది. అమెరికా వద్ద 8,100 టన్నులకు పైగా అధికారిక బంగారు నిల్వలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగాన్ని ఫోర్ట్ నాక్స్ వంటి అత్యంత భద్రత కలిగిన ఖజానాల్లో భద్రపరిచారు. జర్మనీ సుమారు 3,300 టన్నుల బంగారంతో రెండో స్థానంలో ఉంది. ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు 2,400 నుంచి 2,500 టన్నుల బంగారు నిల్వలతో తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. గత దశాబ్దంలో రష్యా, చైనా అత్యంత దూకుడుగా బంగారం కొనుగోలు చేసిన దేశాలుగా మారాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు దాదాపు 2,300 టన్నుల చొప్పున బంగారాన్ని కలిగి ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి.
Details
ఇటీవలి కాలంలో ఎక్కువగా బంగారం కొనుగోలు చేసిన దేశాలేవి?
స్విట్జర్లాండ్, జపాన్, భారత్ వంటి దేశాలు 800 నుంచి 1,000 టన్నుల మధ్య బంగారు నిల్వలను కలిగి ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గణాంకాల ప్రకారం భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 800-900 టన్నుల అధికారిక బంగారు నిల్వలు ఉన్నాయి. దీంతో భారత్ ప్రపంచ టాప్-10 బంగారు నిల్వల దేశాల్లో ఒకటిగా నిలిచింది. 2010 తర్వాత బంగారం కొనుగోలు చేసే దేశాల స్వరూపమే మారిపోయింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికల ప్రకారం 2022, 2023 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కలిపి వెయ్యి టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇది చరిత్రలోనే రికార్డు స్థాయి కొనుగోళ్లుగా గుర్తింపు పొందింది.
Details
బంగారు నిల్వలను పెంచుతున్నట్లు ప్రకటన
పాశ్చాత్య దేశాల ఆంక్షల అనంతరం డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు రష్యా బంగారం కొనుగోళ్లను భారీగా పెంచింది. అనేక అంతర్జాతీయ పరిశోధన నివేదికలు ఈ వ్యూహాన్ని 'డీ-డాలరైజేషన్' దిశగా రష్యా అడుగులుగా అభివర్ణిస్తున్నాయి. ఇదే సమయంలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా నెలల తరబడి తన బంగారు నిల్వలను పెంచుతున్నట్లు బహిరంగంగా ప్రకటించింది. అమెరికా ట్రెజరీ బాండ్ల నుంచి క్రమంగా బంగారం, ఇతర వస్తువుల ఆధారిత ఆస్తుల వైపు చైనా అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Details
జాతీయ భద్రతా స్థాయికి చేరింది
టర్కీ, కజకిస్థాన్, ఖతార్, పోలాండ్‌తో పాటు కొన్ని మాజీ సోవియట్ దేశాలు కూడా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసిన దేశాలుగా మారాయి. భౌగోళిక రాజకీయ అస్థిరతలు, కరెన్సీ సంక్షోభాల నుంచి రక్షణ కోసం దేశాలు బంగారాన్ని ఆశ్రయిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. హంగేరీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ గ్యోర్గీ మాటోల్సీ ఒక సందర్భంలో మాట్లాడుతూ, "బంగారం లాభాల కోసం మాత్రమే కాదు, ఇది జాతీయ వ్యూహంలో భాగం" అని వ్యాఖ్యానించారు. ఇది బంగారం ప్రాధాన్యం ఇప్పుడు జాతీయ భద్రతా స్థాయికి చేరిందని సూచిస్తోంది.
Details
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం చారిత్రాత్మక గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతోంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. మొదటిది యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఘర్షణలు, తైవాన్‌పై పెరుగుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం సురక్షిత ఆశ్రయంగా మారింది. రెండవ కారణం ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు డాలర్, యూరోతో పోలిస్తే ఒత్తిడికి గురైనప్పుడు, ప్రజలు కాగితపు ఆస్తుల్ని వదిలి భౌతిక బంగారం లేదా బంగారు ఆధారిత సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
Details
ధరలు మరింత ఎగబాకే అవకాశం
హెడ్జ్ ఫండ్ మేనేజర్ రే డాలియో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మీరు బంగారం కలిగి లేకపోతే, చరిత్ర గానీ ఆర్థిక శాస్త్రం గానీ మీకు అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. మూడవ ప్రధాన కారణం కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు. ప్రపంచంలోని అతిపెద్ద కేంద్ర బ్యాంకులు ఏటా మార్కెట్ నుంచి వెయ్యి టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో సరఫరా తగ్గి, ధరలు మరింత ఎగబాకుతున్నాయి. ఈ పరిణామాలన్నింటిని చూస్తే, బంగారం ఇకపై కేవలం పెట్టుబడి సాధనం మాత్రమే కాకుండా, దేశాల వ్యూహాత్మక ఆస్తిగా మారిందన్నది స్పష్టమవుతోంది.