Loading...
Anup Bagchi: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త బాస్‌గా అనుప్ బాగ్చీ.. ఆయన గురించి తెలుసా?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త బాస్‌గా అనుప్ బాగ్చీ.. ఆయన గురించి తెలుసా?

Anup Bagchi: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త బాస్‌గా అనుప్ బాగ్చీ.. ఆయన గురించి తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ (సీఈఓ)గా అనుప్ బాగ్చీని నియమించింది. మూడేళ్ల కాలానికి ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆమోదం తర్వాత ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం బాగ్చీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఉన్నారు. అక్టోబర్ 26తో ప్రస్తుత సీఈఓ శశిధర్ జగదీశన్ పదవీకాలం ముగియనుండటంతో ఆయన స్థానంలో బాగ్చీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

వివరాలు 

బ్యాంకింగ్‌లో అనుభవం.. కీలక బాధ్యతలు

అనుప్ బాగ్చీ గతంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేశారు. అక్కడ రిటైల్, హోల్‌సేల్ బ్యాంకింగ్ విభాగాలకు ఆయన నేతృత్వం వహించారు.

ప్రస్తుతం మార్కెట్లలో ఒడుదొడుకులు, బ్యాంకు నాయకత్వంలో మార్పులు, మార్జిన్‌పై ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో బాగ్చీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇదే సమయంలో బ్యాంక్ షేర్లపై విక్రయ ఒత్తిడి కూడా కనిపిస్తోంది.

నిబంధనల ప్రకారం సీఈఓ పదవి కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆర్‌బీఐకి ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది.

అనుప్ బాగ్చీతో పాటు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ భరూచా పేరును కూడా సమర్పించింది.

వివరాలు 

మూడు దశాబ్దాలకు పైగా అనుభవం

అనుప్ బాగ్చీకి బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, వెల్త్ మేనేజ్‌మెంట్, ఇన్సూరెన్స్ రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.

1992 నుంచి ఆయన ఐసీఐసీఐ గ్రూప్‌తో అనుబంధంగా ఉన్నారు.

కాన్పూర్ ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ, బెంగళూరులోని ఐఐఎం నుంచి మేనేజ్‌మెంట్ డిగ్రీని బాగ్చీ పొందారు.

మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీశన్ తన పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ నియామకం కోరుకోవడం లేదని ఆగస్టు 29న బ్యాంక్ బోర్డుకు తెలియజేశారు.

ADVERTISEMENT