Dhruv Sharma: '32 అవెన్యూ' కేంద్రంగా రూ.500 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం.. ఎవరీ ధ్రువ్ శర్మ..?
ఈ వార్తాకథనం ఏంటి
గురుగ్రామ్‌లోని పేరుగాంచిన లగ్జరీ కమర్షియల్ డెస్టినేషన్ '32 అవెన్యూ' ఇప్పుడు భారీ స్థాయి రియల్ ఎస్టేట్ కుంభకోణానికి కేంద్రమైంది. సక్సెస్‌ఫుల్ యంగ్ ఎంట్రప్రెన్యూర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కంపెనీ సీఈఓ ధ్రువ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా సంచలనం రేపింది. దాదాపు రూ.500 కోట్ల విలువైన ఈ మోసానికి సంబంధించిన వివరాలు బయటపడుతున్న కొద్దీ అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 2న ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
వివరాలు
2022-23 మధ్యకాలంలోఈ ప్రాపర్టీ మరో 25 మందికి విక్రయం
2021 సెప్టెంబరులో 32 అవెన్యూ భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న 3 వేల చదరపు అడుగుల కమర్షియల్ యూనిట్‌ను రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసేందుకు ధ్రువ్ శర్మ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మొత్తం డబ్బులు చెల్లించినప్పటికీ ఇప్పటివరకు ఆస్తి తమ పేరుకు బదలాయించలేదని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు షాకింగ్ విషయాలను గుర్తించారు. దర్యాప్తులో తేలిన ప్రకారం... అదే ప్రాపర్టీని 2022-23 మధ్యకాలంలో మరో 25 మందికి విక్రయించారు. ఈ మోసాన్ని బయటపడకుండా ఉంచేందుకు ప్రతి సారి విక్రయం పూర్తయ్యాక ఆ యూనిట్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంటామని అగ్రిమెంట్లు చేసుకున్నారు. కొనుగోలుదారులకు నెలనెలా అద్దె చెల్లిస్తూ అనుమానం రాకుండా చూసుకున్నారు.
వివరాలు
దేశవ్యాప్తంగా పలువురు ఇన్వెస్టర్లను కూడా ప్రాపర్టీ విక్రయాల పేరుతో మోసం
అయితే 2025 ఆగస్టు నుంచి అద్దె చెల్లింపులు ఆగిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. అందరూ కలిసి 32అవెన్యూ కార్యాలయానికి వెళ్లిన సమయంలో అసలు మోసం వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు ఇన్వెస్టర్లను కూడా ప్రాపర్టీ విక్రయాల పేరుతో మోసం చేసినట్లు విచారణలో తేలింది. చెప్పినదానికంటే చిన్న విస్తీర్ణం ఉన్న ఆస్తులు ఇవ్వడం,డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకపోవడం వంటి అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై గురుగ్రామ్ ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసి గత వారం ధ్రువ్ శర్మను అరెస్టు చేసింది. కోర్టులో హాజరుపర్చిన అనంతరం అతడిని పోలీసు కస్టడీకి అప్పగించారు. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.500 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ధ్రువ్ శర్మ నేపథ్యం
ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బుతో గోవా, రాజస్థాన్‌లలో హోటళ్లు, భూములు కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అప్పగించే అంశంపై కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ధ్రువ్ శర్మ నేపథ్యం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
ధ్రువ్ శర్మ నేపథ్యం
34 ఏళ్ల ధ్రువ్ శర్మ 2013లో అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. 2014లో భారత్‌కు వచ్చి 'గెస్ట్‌హౌసర్' పేరుతో వెకేషన్ పోర్టల్‌ను ప్రారంభించాడు. 2015లో 32 అవెన్యూ ప్రాజెక్టును స్థాపించి దాన్ని లగ్జరీ హబ్‌గా అభివృద్ధి చేశాడు. ఇక్కడి రెస్టారెంట్లు, రిటైల్ అవుట్‌లెట్లు గురుగ్రామ్‌లో మంచి గుర్తింపు పొందాయి. 2019లో ఫోర్బ్స్ 30 అండర్-30 ఆసియా జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గురుగ్రామ్‌కు న్యూయార్క్ తరహా లైఫ్‌స్టైల్‌ను పరిచయం చేసిన యువ వ్యాపారవేత్తగా అతడికి పేరు వచ్చింది. దిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, గోవా ప్రాంతాల్లో ఈ కంపెనీకి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది.