Vik Bajaj: జెఫ్ బెజోస్ AI స్టార్టప్ ప్రాజెక్ట్ ప్రోమేతియస్ సహ వ్యవస్థాపకుడు విక్ బజాజ్ ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
అమెజాన్ మాజీ సీఈఓ జెఫ్ బెజోస్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'ప్రాజెక్ట్ ప్రొమీథియస్'ను ప్రారంభించారు. ఈ కంపెనీలో బెజోస్ స్వయంగా కో-సీఈఓగా బాధ్యతలు చేపట్టగా, ఫిజిసిస్ట్,కెమిస్ట్ అయిన విక్రమ్ "విక్" బజాజ్ సహ వ్యవస్థాపకుడిగా, కో-సీఈఓగా చేరారు. MIT నుంచి ఫిజికల్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన బజాజ్, పెన్సిల్వేనియా యూనివర్శిటీలో బ్యాచిలర్, మాస్టర్స్ పూర్తిచేశారు. గూగుల్‌కు చెందిన 'X' మూన్‌షాట్ ల్యాబ్‌లో పనిచేసిన ఆయన, 2015లో అల్ఫాబెట్ కంపెనీకి చెందిన వెరిలీ అనే లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ల్యాబ్‌ను మరొకరితో కలిసి ప్రారంభించారు. అదే విధంగా,ఫోర్‌సైట్ క్యాపిటల్‌కు సంబంధించిన ఎఐ ఆధారిత ఫోర్‌సైట్ ల్యాబ్‌ను కూడా ఆయన సహవ్యవస్థాపకుడిగానే ప్రారంభించారు.
వివరాలు
"ఫిజికల్ ఎకానమీ కోసం ఎఐ"
ఇటీవల ఫోర్‌సైట్ ల్యాబ్ సీఈఓ పదవి నుంచి వైదొలిగి ప్రాజెక్ట్ ప్రొమీథియస్‌లో చేరారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. స్టాన్‌ఫర్డ్ మెడిసిన్ స్కూల్,లారెన్స్ బెర్క్లీనేషనల్ ల్యాబ్,యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-బెర్క్లీ వంటి ప్రముఖ సంస్థల్లో అకడమిక్ రోల్స్ కూడా నిర్వహించారు. పరిశ్రమలలో..ప్రత్యేకంగా కంప్యూటర్లు,ఏరోస్పేస్, ఆటోమొబైల్స్ రంగాల్లో..ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఎఐ టెక్నాలజీని వాడడమే ప్రాజెక్ట్ ప్రొమీథియస్ లక్ష్యం. కంపెనీ ఎప్పుడు స్థాపించబడిందో స్పష్టత లేకపోయినా,ఇప్పటికే ఓపెన్ఏఐ,డీప్‌మైండ్,మెటా వంటి దిగ్గజాల నుంచి పరిశోధకులను రప్పిస్తూ దాదాపు వంద మందిని నియమించుకుంది. రోబోటిక్స్,డ్రగ్ డిజైన్, సైంటిఫిక్ డిస్కవరీ వంటి వాస్తవిక పనుల్లో ఎఐ ఉపయోగంపై దృష్టి పెట్టిన ఈ స్టార్టప్,లింక్డ్ఇన్ వివరాల ప్రకారం'ఫిజికల్ ఎకానమీ కోసం ఎఐ' తయారు చేయడమే తన ప్రధాన లక్ష్యంగా చెప్పుకుంది.
వివరాలు
ఈ ప్రాజెక్ట్‌తో మళ్లీ సీఈఓగా బెజోస్
ఇప్పటికే 6.2 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి సమకూర్చుకున్న ఈ సంస్థలో ముఖ్య భాగం బెజోస్ నుంచే వచ్చింది, దీంతో ప్రపంచంలోనే ప్రారంభ దశలోనే అత్యధిక ఫండింగ్ పొందిన ఎఐ స్టార్టప్స్‌లో ఇది ఒకటిగా నిలిచింది. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్‌లతో పాటు ఓపెన్‌ఎఐ వంటి పాత ప్లేయర్ల మధ్య ఎఐ రంగంలో పోటీ పెరుగుతున్న వేళ, ఈ కొత్త కంపెనీ పీరియాడిక్ ల్యాబ్స్ తరహాలో సైన్స్ రీసెర్చ్ వేగవంతం చేసే టెక్నాలజీలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. మరోవైపు, అమెజాన్ సీఈఓ పదవి నుంచి నాలుగేళ్ల క్రితం దిగిపోయిన బెజోస్, ఈ ప్రాజెక్ట్‌తో మళ్లీ సీఈఓగా అధికారిక బాధ్యతల్లోకి వచ్చారు.
వివరాలు
'ఫిజికల్ ఇంటెలిజెన్స్' లో పెట్టుబడి
ఈ మధ్య ఆయన బ్లూ ఆరిజిన్‌తో పాటు అభివృద్ధిలో ఉన్న ఎఐ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. పెర్ప్లెక్సిటీ, ఫిగర్ ఎఐ, టోలోకా, కోబోల్డ్ మెటల్స్ వంటి స్టార్టప్స్‌కి ఆయన ఇప్పటికే ఫండింగ్ అందించారు. గత సంవత్సరం రోబోట్లకు ఎఐ అప్లై చేసే 'ఫిజికల్ ఇంటెలిజెన్స్' లో కూడా ఆయన పెట్టుబడి పెట్టారు. ఇదే సమయంలో, ఇటలీలో జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్‌తో జరిగిన అతని హై-ప్రొఫైల్ వెడ్డింగ్ కూడా మీడియా దృష్టిని ఆకర్షించింది.