LOADING...
Air India CEO: ఎయిరిండియా సీఈఓ మార్పుపై టాటాల కసరత్తు.. క్యాంప్‌బెల్‌ విల్సన్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో టాటా గ్రూప్?
క్యాంప్‌బెల్‌ విల్సన్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో టాటా గ్రూప్?

Air India CEO: ఎయిరిండియా సీఈఓ మార్పుపై టాటాల కసరత్తు.. క్యాంప్‌బెల్‌ విల్సన్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో టాటా గ్రూప్?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా ప్రస్తుత సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ (Campbell Wilson) భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. ఆయన పనితీరుపై టాటా గ్రూప్‌ అగ్రనేతలు అసంతృప్తిగా ఉన్నారని, త్వరలోనే ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే అవకాశం ఉందని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఎకనామిక్‌ టైమ్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. విల్సన్‌ను పదవీ కాలం పూర్తికాకముందే తప్పించి, మరో సీనియర్‌ లీడర్‌కు సీఈఓ బాధ్యతలు అప్పగించాలని టాటాసన్స్‌ యోచిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన అనుభవజ్ఞులైన నాయకులతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

వివరాలు 

 రంగంలోకి టాటా గ్రూప్‌ ఛైర్మన్

ఈ అంశంపై టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన రెండు అగ్రశ్రేణి విమానయాన సంస్థల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లతో ఆయన చర్చలు జరిపినట్లు కథనాలు వెల్లడించాయి. ఎయిరిండియాను వేగంగా అభివృద్ధి దిశగా నడిపించడంలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోవడమే చంద్రశేఖరన్‌ అసంతృప్తికి కారణమని సమాచారం. ఇదే సమయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సీఈఓ అలోక్‌ సింగ్‌ కొనసాగింపుపై కూడా పునరాలోచన జరుగుతోందని తెలుస్తోంది. విల్సన్‌, అలోక్‌ సింగ్‌ ఇద్దరి పదవీ కాలాలు 2027 వరకే ఉండగా, అంతకుముందే మార్పులు జరిగే అవకాశం ఉందని కథనాలు సూచిస్తున్నాయి.

వివరాలు 

విల్సన్‌పై అసంతృప్తికి కారణాలేంటి?

న్యూజిలాండ్‌కు చెందిన క్యాంప్‌బెల్‌ విల్సన్‌ 2022 జులైలో ఎయిరిండియా సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. సంస్థను అంతర్జాతీయ స్థాయిలో పోటీగల విమానయాన సంస్థగా తీర్చిదిద్దడం, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా ఐదేళ్ల ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా విస్తారా-ఎయిరిండియా విలీనం విజయవంతంగా పూర్తి కావడం ఒక ముఖ్యమైన ముందడుగుగా భావించబడింది. కొన్ని కీలక మార్గాల్లో ఇండిగోను మించి ఎయిరిండియా ముందంజ వేయగలిగింది. అయితే మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా సప్లయ్‌ చైన్‌ సమస్యల కారణంగా కొత్త విమానాల డెలివరీ ఆలస్యం కావడం సంస్థపై ప్రభావం చూపింది. దీంతో ప్రయాణికుల సేవల నాణ్యత, సమయపాలనలో గణనీయమైన మెరుగుదల కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

వివరాలు 

అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం కూడా విల్సన్‌ పాత్ర తగ్గడానికి ఒక కారణం

ఇదే సమయంలో గతేడాది అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం తర్వాత మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ ఘటన అనంతరం ప్రభుత్వ అధికారులు విల్సన్‌ను పక్కనపెట్టి, నేరుగా టాటా గ్రూప్‌ అగ్రనేతలతో సంప్రదింపులు జరపడం మొదలుపెట్టారని ఎకనామిక్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ పరిణామం కూడా విల్సన్‌ పాత్ర తగ్గడానికి ఒక కారణంగా మారిందని కథనం విశ్లేషించింది. ఇదిలా ఉండగా, నిబంధనల ఉల్లంఘనలు, గడువు ముగిసిన లైసెన్స్‌తో విమానాలను నడిపిన ఘటనలపై క్యాంప్‌బెల్‌ విల్సన్‌ సహా పలువురు ఎయిరిండియా ఉన్నతాధికారులకు డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం మరింత ఇబ్బందికరంగా మారింది.

Advertisement

వివరాలు 

అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని టాటా గ్రూప్

దీనితో పాటు కంపెనీ ఆర్థిక స్థితిలో కూడా ఆశించిన స్థాయిలో మెరుగుదల కనిపించకపోవడం వల్ల, విల్సన్‌ను పదవీ కాలం పూర్తయ్యేలోపే తప్పించాలనే ఆలోచనకు టాటా గ్రూప్‌ వచ్చిందని కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై టాటా గ్రూప్‌ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement