అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి కారణాలేంటి?
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ముడి చమురు ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న దేశాలు మరింత ఇబ్బందుల్లోకి వెళ్లనున్నాయి. ఉత్పత్తిదేశాలు సరఫరాను తగ్గించనున్నాయన్న మార్కెట్ల అంచనా వేయడం వల్ల ముడి చమురు ధరలు పెరిగాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా ఉండటానికి ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందనే ఊహాగానాల వార్తలు కూడా చమురు ధరలు పెరగడానికి మరోక కారణంగా తెలుస్తోంది. పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురు ధరలు.. ద్రవ్యోల్బణం, వ్యాపార వ్యయాలు, ఇంధన బిల్లులు, ప్రపంచ వాణిజ్యం, ప్రభుత్వ బడ్జెట్‌లు, మార్కెట్లు, భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై తీవ్రమైన ప్రభావం పడనుంది.
ఖర్చులను తగ్గించుకునే పనిలో పరిశ్రమలు
చమురు ధరల పెరుగుదలపై ఏసీఎంఈ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజిస్ట్ సుగంధ సచ్‌దేవా స్పందించారు. చమురు ఉత్పత్తి చేసే దేశాలైన రష్యా, సౌదీ అరేబియా నుంచి అదనపు సరఫరా కోతలను అంచనా వేయడం వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నట్లు సచ్‌దేవా చెప్పారు. ఎగుమతి కోతలకు సంబంధించిన ఒప్పందానికి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఓపీఈసీ)తో రష్యా అంగీకరించిందని ఆ దేశ ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ ధృవీకరించారు. చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమలు కూడా తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ పరిణామం కంపెనీల లాభాలపై ప్రభావం చూపవచ్చు. అంతేకాకుండా ఉద్యోగాల కోతలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.