HAL: HAL షేర్లకు భారీ దెబ్బ: ఒక్కరోజులో 9% పతనం
ఈ వార్తాకథనం ఏంటి
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) షేర్లు సోమవారం దాదాపు 9% వరకు పతనమయ్యాయి. దుబాయ్ ఎయిర్ షోలో ప్రదర్శన సమయంలో HAL తయారు చేసిన తేజస్ యుద్ధవిమానం కూలిపోవడం, పైలట్ వింగ్ కమాండర్ నమాంశ్ సయాల్ మృతి చెందడం మార్కెట్‌పై పెద్ద ప్రభావం చూపింది. ఈ ప్రమాదం తర్వాత HAL షేర్లు BSEలో ఉదయం ట్రేడింగ్ సమయంలో 8.48% వరకు పడిపోయి ₹4,205.25 వద్దకు చేరాయి. తేజస్ కార్యక్రమంలో ఎలాంటి ప్రధాన లోపాలు లేవని నిపుణులు పేర్కొన్నా, ఈ ఘటన కారణంగా కొంతకాలం స్టాక్‌లో ఒత్తిడి, పెట్టుబడిదారుల జాగ్రత్త పెరుగుతుందని భావిస్తున్నారు. అయిల్ లీకేజీపై వచ్చిన అపోహలను ప్రభుత్వం ఖండించింది. ఆ సమస్యకి ఈ ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
వివరాలు
భారీ అంచనాలతో షేర్ ధరలు
అయినప్పటికీ HALపై పరిశీలన పెరిగే అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, HAL దగ్గర 97 తేజస్ ఫైటర్ల కొత్త భారీ ఆర్డర్‌తో పాటు హెలికాప్టర్లు,ఇంజిన్లకు కూడా మంచి డిమాండ్ కొనసాగుతోంది. దీంతో కంపెనీ ఆర్డర్‌బుక్ ఇప్పటివరకు లేనంత బలంగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే భారీ అంచనాలతో షేర్ ధరలు ఇప్పటికే ఎక్కువ స్థాయిలో ట్రేడవుతున్నందున, ఇటువంటి సంఘటనలు తాత్కాలిక ఒత్తిడిని తీసుకొస్తున్నాయని నిపుణుల విశ్లేషణ. అయినప్పటికీ HAL దీర్ఘకాలిక పనితీరు బలంగానే ఉందని అనలిస్టులు విశ్వసిస్తున్నారు. చాయిస్ బ్రోకింగ్ HALపై'బై' రేటింగ్‌ను కొనసాగిస్తూ,ఒక్కో షేర్‌కు ₹5,570టార్గెట్‌ను ప్రకటించింది. తాత్కాలిక హెచ్చుతగ్గులు వచ్చినా,దేశ రక్షణ సామర్థ్యాల పెంపు దిశలో HAL ప్రాజెక్టులు గాడిలోనే ఉన్నాయని నిపుణుల అభిప్రాయం.