LOADING...
IndiGo's A321 XLR: భారత విమానయానానికి గేమ్‌చేంజర్‌గా ఇండిగో తొలి A321 XLR విమానం
భారత విమానయానానికి గేమ్‌చేంజర్‌గా ఇండిగో తొలి A321 XLR విమానం

IndiGo's A321 XLR: భారత విమానయానానికి గేమ్‌చేంజర్‌గా ఇండిగో తొలి A321 XLR విమానం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత విమానయాన రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఇండిగో సంస్థకు చెందిన దేశంలో తొలి ఎయిర్‌బస్ A321 XLR విమానం ఢిల్లీకి చేరుకుంది. దీని ద్వారా ఇండిగో తన ఫ్లీట్ విస్తరణలోనే కాదు,దూర దేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమాన సర్వీసులపై దృష్టి పెడుతోందన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. "ఢిల్లీకి ల్యాండ్ అయ్యింది! భారత్‌లో తొలి A321 XLR చివరకు స్వదేశానికి చేరుకుంది" అని ఎక్స్ లో ఇండిగో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఇండిగో వెల్లడిస్తూ, ఇది భారత విమానయాన రంగంలో ఓ కీలక ఘట్టమని పేర్కొంది. "భారత్ తొలి A321 XLR విమానం స్వదేశానికి రానుంది" అని మరో పోస్ట్‌లో తెలిపింది.

వివరాలు 

అంతర్జాతీయ విస్తరణకు ఊతమిచ్చే ఎక్కువ దూరం ప్రయాణించే విమానం

ఎయిర్‌బస్ తయారు చేసిన A321 XLR ప్రత్యేకంగా క్కువ దూరం ప్రయాణించే ప్రయాణాల కోసం రూపకల్పన చేశారు. దీని ద్వారా ఇండిగో మరింత పొడవైన అంతర్జాతీయ రూట్లలో నాన్‌స్టాప్ విమాన సర్వీసులు నిర్వహించనుంది. ఖర్చులను నియంత్రణలో ఉంచుకుంటూనే దూర దేశాలకు నేరుగా విమానాలు నడపడానికి ఈ విమానం ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఏథెన్స్ వంటి నగరాలకు డైరెక్ట్ ఫ్లైట్లు ప్రారంభించే అవకాశముంది. దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఉన్న ఇండిగో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తన ఉనికిని పెంచుకుంటోంది. A321 XLR చేరికతో న్యారో బాడీ, వైడ్ బాడీ విమానాల మధ్య ఉండే రూట్లను సులభంగా నిర్వహించే సౌలభ్యం లభించనుంది. ఈ విమానాన్ని దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల రెండింటికీ వినియోగించే అవకాశం ఉంది.

వివరాలు 

ఇండిగోకు A321 XLR ఎందుకు కీలకం?

A321 XLR అనేది ఎయిర్‌బస్ ప్రసిద్ధ A321 నీయోకు దీర్ఘదూర వెర్షన్. ఎయిర్‌బస్ సమాచారం ప్రకారం ఇది గరిష్టంగా 4,700 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు. ఒకేసారి దాదాపు 244 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఎలాంటి స్టాప్ అవసరం లేకుండా సుమారు 11 గంటల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండటంతో,ఇప్పటివరకు న్యారో బాడీ విమానాలతో కష్టమైన రూట్లు ఇప్పుడు సాధ్యమవుతాయి. ఈ విమానం పాత మోడళ్లతో పోలిస్తే సుమారు 30శాతం తక్కువ ఇంధనం వినియోగిస్తుందని,అలాగే 50 శాతం తక్కువ శబ్దం ఉత్పత్తి చేస్తుందని ఎయిర్‌బస్ తెలిపింది. 44.41 మీటర్ల పొడవు, 101.5 టన్నుల గరిష్ట టేక్ ఆఫ్ వెయిట్‌తో, ఈ విమానం తన విభాగంలో అత్యంత సమర్థవంతమైన వాటిలో ఒకటిగా నిలుస్తోంది.

Advertisement

వివరాలు 

ఇండిగోకు A321 XLR ఎందుకు కీలకం?

ఇక గత నెలలో ఎదురైన విమాన రద్దుల వంటి అంతరాయాల తర్వాత, కార్యకలాపాల స్థిరత్వాన్ని మెరుగుపర్చే దిశగా ఇండిగో పనిచేస్తున్న సమయంలోనే ఈ విమానం చేరడం గమనార్హం. గత ఏడాది ఎదురైన సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకున్నామని సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇండిగో వృద్ధిపై ధీమాగా ఉంది. 2025 చివరి నాటికి 123 మిలియన్లకుపైగా ప్రయాణికులను రవాణా చేస్తామని అంచనా వేస్తోంది. 2024లో ఇది 113 మిలియన్లు ఉండగా, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విస్తరణతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.

Advertisement