Warren Buffett: వారెన్ బఫెట్ కీలక నిర్ణయం.. గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలకు తాత్కాలిక బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, బెర్క్‌షైర్ హాతవే ఛైర్మన్ వారెన్ బఫెట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతి ఏడాది ఇస్తున్న విరాళాన్ని ఈసారి గేట్స్ ఫౌండేషన్‌కు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. బిల్ గేట్స్‌కు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గతంలో ఉన్న సంబంధాలపై జరుగుతున్న సమీక్ష పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని సమాచారం. ఈ సమీక్షలో గేట్స్ ఫౌండేషన్‌తో పాటు దాని సహ వ్యవస్థాపకుడి గత సంబంధాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
గేట్స్ ఫౌండేషన్‌కు బఫెట్ ఇచ్చిన విరాళాల విలువ 4.5 బిలియన్ డాలర్లు
ఇది బఫెట్ ఇప్పటివరకు పాటిస్తున్న సంప్రదాయానికి భిన్నమైన నిర్ణయంగా భావిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది మధ్యలో బెర్క్‌షైర్ హాతవే షేర్లను గేట్స్ ఫౌండేషన్‌తో పాటు తన కుటుంబానికి చెందిన నాలుగు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించేవారు. గత ఏడాది మాత్రమే గేట్స్ ఫౌండేషన్‌కు ఆయన ఇచ్చిన విరాళాల విలువ 4.5 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. 2006లో సేవా కార్యక్రమాల కోసం విరాళాలు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 47 బిలియన్ డాలర్లకు పైగా విలువైన బెర్క్‌షైర్ షేర్లను గేట్స్ ఫౌండేషన్‌కు అందించారు. బఫెట్ సంపదలో అత్యధిక భాగాన్ని అందుకున్న సంస్థ కూడా ఇదే.
వివరాలు
గేట్స్-ఎప్‌స్టీన్ సంబంధాలపై మళ్లీ చర్చ
ఈ ఏడాది ప్రారంభంలోనే గేట్స్-ఎప్‌స్టీన్ సంబంధాలపై మళ్లీ చర్చ మొదలవడంతో భవిష్యత్తులో ఫౌండేషన్‌కు విరాళాల విషయంలో పునరాలోచిస్తున్నట్లు బఫెట్ సంకేతాలు ఇచ్చారు. మార్చిలో సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాల్లో బిల్ గేట్స్ పలుమార్లు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను కలిసినట్లు వెల్లడైన తర్వాత తాను గేట్స్‌తో మాట్లాడలేదని చెప్పారు. 2008లో ఫ్లోరిడాలో వ్యభిచారానికి సంబంధించిన కేసులో ఎప్‌స్టీన్ దోషిగా తేలిన తర్వాత కూడా వీరిద్దరి సమావేశాలు జరిగినట్లు ఆ పత్రాల్లో పేర్కొన్నారు.
వివరాలు
గేట్స్ ఫౌండేషన్‌కు చేసిన విరాళాలపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు: బఫెట్
అయితే బిల్ గేట్స్ తన చర్యలకు బాధ్యత వహించారని, ఎప్‌స్టీన్‌కు ఫౌండేషన్ మంజూరు చేసే నిధుల నిర్ణయాల్లో ఎలాంటి పాత్ర లేదని గేట్స్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. మరోవైపు, తాను గేట్స్ ఫౌండేషన్‌కు చేసిన విరాళాలపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని బఫెట్ తెలిపారు. అయితే కొన్ని సంఘటనలు జరగకుండా ఉండి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. 2019లో లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టయ్యే ముందు ఎప్‌స్టీన్ అనేక మంది ప్రముఖుల విశ్వాసాన్ని ఎలా సంపాదించగలిగాడో చూసి తాను ఆశ్చర్యపోయానని కూడా బఫెట్ పేర్కొన్నారు.