LOADING...
Finance Ministry: 8వ వేతన సంఘం సిఫార్సులు.. డీఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేస్తారా? స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ 
స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

Finance Ministry: 8వ వేతన సంఘం సిఫార్సులు.. డీఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేస్తారా? స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

8వ వేతన సంఘం ఏర్పాటు, అమలు ప్రక్రియలో ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వేతన సంఘం సిఫార్సుల కోసం సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,అలాగే 69 లక్షల మందికిపైగా పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాదితో 7వ వేతన సంఘం గడువు ముగియాల్సి ఉండగా,వెంటనే 8వ వేతన సంఘం అమల్లోకి రావాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అమలు ప్రక్రియ ముందుకు కదలడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే 8వ వేతన సంఘం ఏర్పాటు అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.

వివరాలు 

8వ వేతన సంఘం ద్వారా వేతనాలు,పెన్షన్లు సవరించబడతాయి 

అనంతరం కమిషన్ పని తీరుకు సంబంధించి రూపొందించిన విధివిధానాలకు తాజాగా నవంబర్ నెలలో ఆమోదం లభించింది. దీంతో ఇప్పటి నుంచే కమిషన్ నిర్ణయించిన నియమావళి ప్రకారం అధ్యయనం చేసి సిఫార్సులు తయారు చేసే ప్రక్రియ మొదలుకానుంది. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే సాధారణంగా ఉద్యోగుల జీతాలు,పెన్షనర్ల పెన్షన్లు గణనీయంగా పెరుగుతుంటాయి. ఇదే సమయంలో గత కొంతకాలంగా డీఏ (కరవు భత్యం),అలాగే పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) మొత్తాలను బేసిక్ పేలో విలీనం చేయనున్నారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 8వ వేతన సంఘం ద్వారా వేతనాలు,పెన్షన్లు సవరించబడతాయని మాత్రమే చెప్పారు గానీ,డీఏ విలీనంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

వివరాలు 

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టమైన ప్రకటన

ఇప్పుడు ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. డీఏ,డీఆర్‌లను బేసిక్ పేలో కలపాలన్న ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలియజేశారు. లోక్‌సభలో సభ్యుల ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఉద్యోగులు ధరల భారం భరించలేకపోతున్నారని పేర్కొంటూ,తక్షణ ఉపశమనం కోసం డీఏ/డీఆర్‌ను బేసిక్ పేలో విలీనం చేస్తారా అనే ప్రశ్నకు ఆయన స్పష్టంగా "అలాంటి నిర్ణయం ప్రస్తుతం లేదు" అని చెప్పుకొచ్చారు. డీఏ లేదా డీఆర్‌ను ఒకవేళ బేసిక్ పేలో విలీనం చేస్తే, కొత్త వేతన సంఘం అమలులోకి వచ్చినప్పుడు వీటిని తిరిగి సున్నా స్థాయి నుండి లెక్కించడం మొదలుపెట్టాల్సి ఉంటుంది.

Advertisement

వివరాలు 

మొత్తం డీఏ శాతం ఇప్పుడు 58

అయితే ఈ దిశగా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. కరవు భత్యం (డీఏ), డీఆర్ అనేవి పెరుగుతున్న ధరల భారాన్ని తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే ఆర్థిక ఉపశమన చర్యలుగా కొనసాగుతున్నాయి. వీటిని ప్రతి సంవత్సరం రెండుసార్లు సవరించడం ఆనవాయితీ. జనవరి 1, జూలై 1 నుంచి అమలులోకి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ, సాధారణంగా మార్చి నెలలో హోలీ పండుగ సమయంలో ఒకసారి, అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో దీపావళి సమయంలో మరోసారి అధికారికంగా ప్రకటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా దీపావళి సందర్భంగా డీఏను 3 శాతం పెంచగా, మొత్తం డీఏ శాతం ఇప్పుడు 58 శాతానికి చేరుకుంది.

Advertisement