LOADING...
Right to Disconnect: 2026లో అయినా ఉద్యోగులకు 'రైట్ టు డిస్‌కనెక్ట్' హక్కు దక్కుతుందా?
2026లో అయినా ఉద్యోగులకు 'రైట్ టు డిస్‌కనెక్ట్' హక్కు దక్కుతుందా?

Right to Disconnect: 2026లో అయినా ఉద్యోగులకు 'రైట్ టు డిస్‌కనెక్ట్' హక్కు దక్కుతుందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 నాటికి ఉద్యోగులకు 'రైట్ టు డిస్‌కనెక్ట్' అంటే పని వేళలు ముగిశాక ఆఫీస్ కాల్స్, మెయిల్స్‌కు స్పందించాల్సిన అవసరం లేకుండా ఉండే హక్కు లభిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల భారత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 'రైట్ టు డిస్‌కనెక్ట్' బిల్లుపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. లోక్‌సభ ఎంపీ సుప్రియ సూలే తీసుకొచ్చిన ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వాస్తవానికి ప్రభుత్వం ఈ బిల్లును స్వీకరించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల్లో పెరుగుతున్న ఒత్తిడి, బర్నౌట్‌పై దృష్టి ఆకర్షించేందుకే ఈ ప్రయత్నం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు 

'రైట్ టు డిస్‌కనెక్ట్' చట్టాలను తీసుకువస్తాయా

ఇదిలా ఉంటే, కంపెనీల సీఎఈవోలు మాత్రం ఉద్యోగులు ఇంకా ఎక్కువ గంటలు పని చేయాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు జీతాలు పెద్దగా పెరగడం లేదు. కొత్త ఉద్యోగాలు దొరకడం కూడా చాలామందికి కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ మెట్లు ఎక్కడం కంటే, ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కి ప్రాధాన్యం ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో 2026లో మరిన్ని దేశాలు 'రైట్ టు డిస్‌కనెక్ట్' చట్టాలను తీసుకువస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

వివరాలు 

కేరళ ముందడుగు

అక్షరాస్యత,ఆరోగ్యం,మహిళా హక్కులు వంటి అంశాల్లో ముందుండే కేరళ మరోసారి దేశానికి దారి చూపేలా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలోనే కేరళ అసెంబ్లీలో 'రైట్ టు డిస్‌కనెక్ట్' బిల్లును ప్రవేశపెట్టింది. కేరళ కాంగ్రెస్ (ఎం) ఎమ్మెల్యే,అసెంబ్లీ చీఫ్ విప్ డా. ఎన్. జయరాజ్ ఈ బిల్లును తీసుకొచ్చారు. పని వేళలు ముగిశాక యజమానుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఈమెయిల్స్,ఎస్ఎంఎస్‌లు,వీడియో కాల్స్ వంటి కమ్యూనికేషన్‌లకు స్పందించకుండా ఉండే హక్కును ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం. ఈ హక్కును వినియోగించుకున్నందుకు ఉద్యోగులను పదవి తగ్గించడం,ఉద్యోగం నుంచి తొలగించడం,లాభాలు తగ్గించడం లేదా అవకాశాలు కోల్పోయేలా చేయకూడదని బిల్లు స్పష్టం చేస్తోంది.

Advertisement

వివరాలు 

కేరళ ముందడుగు

అలాగే ప్రైవేట్ రంగ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తోంది. ఈ బిల్లు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటనలోని ఆర్టికల్ 24 నుంచి ప్రేరణ పొందింది. అందులో ప్రతి వ్యక్తికి విశ్రాంతి,వినోదం హక్కుగా ఉండాలని,పని గంటలకు పరిమితి ఉండాలని పేర్కొంది. అలాగే జీవించే హక్కు,గౌరవంతో జీవించే హక్కును సూచించే ఆర్టికల్ 21ను కూడా ప్రస్తావించింది. ఈ బిల్లు రూపకల్పనపై జయరాజ్ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో మాట్లాడుతూ,"డిజిటల్ విప్లవం తెలియకుండానే మళ్లీ పాత భూస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చింది. అప్పట్లో కూలీలకు నిర్దిష్ట పని వేళలు ఉండేవి కాదు. ఆ హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వస్తోంది" అని వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు 

ఫిలిప్పీన్స్‌లో పరిస్థితి..

ఈ బిల్లు చట్టంగా మారితే, 2026లో ఇలాంటి చట్టాన్ని ఆమోదించిన దేశంలోని తొలి రాష్ట్రంగా కేరళ నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఫిలిప్పీన్స్‌లో ఇప్పటికే 2017లోనే కార్మిక శాఖ (డోల్) ఉద్యోగులకు పని వేళల తర్వాత డిస్‌కనెక్ట్ అయ్యే హక్కు ఉందని స్పష్టం చేసింది. పని సమయం ముగిశాక ఆఫీస్ మెసేజ్‌లకు స్పందించకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోరాదని తెలిపింది. అయితే ఇది చట్టం కాకుండా విధాన పరమైన ప్రకటన మాత్రమే. ఇటీవల డిసెంబర్ 2025లో ఫిలిప్పీన్స్ కాంగ్రెస్‌లో 'రైట్ టు డిస్‌కనెక్ట్' బిల్లు ప్రవేశపెట్టినట్లు వార్తలు వచ్చాయి. కగయాన్ డి ఓరో ఎంపీ రూఫస్ బి. రోడ్రిగ్జ్ ఈ హౌస్ బిల్ నంబర్ 9735ను ప్రవేశపెట్టారు.

వివరాలు 

ఫిలిప్పీన్స్‌లో పరిస్థితి..

ఇది ప్రస్తుతం కమిటీ స్థాయిలో ఉంది. శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లును కార్మిక సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అమలులో ఉన్న విధంగా ఇది మానసిక ఆరోగ్యం, ఉద్యోగ సంతృప్తిని పెంచుతుందని ఫ్రీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జోస్ 'సన్నీ' మటులా అభిప్రాయపడ్డారు. అయితే యజమానుల సంఘాలు మాత్రం దీని వల్ల ఉత్పాదకత తగ్గుతుందని, పెట్టుబడిదారులు ఇతర దేశాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.

వివరాలు 

యూరప్‌లో అడుగులు

ఐర్లాండ్‌లో ప్రత్యేక చట్టం లేకపోయినా 'ఫార్మల్ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్' అమల్లో ఉంది. సాధారణ పని వేళల తర్వాత పని చేయకూడదన్న హక్కు, ఆ సమయంలో పని చేయనందుకు శిక్షలు ఉండకూడదన్న భరోసా, యజమానులు-ఉద్యోగుల మధ్య పరస్పర గౌరవం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఈ రక్షణలను మరింత బలోపేతం చేసే చట్టంపై ఆలోచన జరుగుతోంది. బ్రిటన్‌లో కొత్త లేబర్ ప్రభుత్వం విస్తృత కార్మిక సంస్కరణల్లో భాగంగా ఇలాంటి చట్టాలపై చర్చ మొదలుపెట్టింది. ఫ్రాన్స్, ఐర్లాండ్ మాదిరిగానే అక్కడ కూడా 'రైట్ టు డిస్‌కనెక్ట్' చట్టం వచ్చే అవకాశముందని అంటున్నారు.

వివరాలు 

చట్టం ఉంటే సరిపోతుందా?

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలు తీసుకురావాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు. ఆకాష్ హెల్త్‌కేర్ సైకియాట్రి అసోసియేట్ కన్సల్టెంట్ డా. పవిత్ర శంకర్ మాట్లాడుతూ, "చట్టాలు ఒత్తిడిని కొంత తగ్గిస్తాయి. కానీ నిజమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ రావాలంటే కార్యాలయ సంస్కృతి, మేనేజర్ల వైఖరి, ఉద్యోగులు సరిహద్దులు పెట్టుకునే ధైర్యం అవసరం. సంస్థల్లో సరైన విధానాలు, సహాయక నాయకత్వం లేకపోతే ఉద్యోగుల శ్రేయస్సు దెబ్బతింటూనే ఉంటుంది" అని అన్నారు. మొత్తానికి 2026లో 'రైట్ టు డిస్‌కనెక్ట్' ఉద్యోగులకు నిజంగా హక్కుగా మారుతుందా అన్నది వేచి చూడాల్సిందే. కానీ ఈ చర్చ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కొత్త దిశలో సాగుతోంది.

Advertisement