Infosys-Wipro-Tcs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 63,759 మంది ఉద్యోగాలను కోల్పోయారు
గత రెండు దశాబ్దాలలో తొలిసారి, భారతీయ ఐటీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) విప్రో (Wipro) సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించినట్లు వార్షిక నివేదికల్లో వెల్లడించాయి. ఈ నివేదికల ప్రకారం మార్చి 31, 2024తో ముగిసిన చివరి త్రైమాసికంలో ఈ సంస్థలలో 63,759 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ క్షీణత తమ ప్రస్తుత ఉద్యోగుల పనితీరు రేటును మెరుగుపరిచేందుకు, తక్కువ సిబ్బందితో మెరుగైన నిర్వహణ కొనసాగించేందుకు, సంస్థల టర్నోవర్ ను పెంచేందుకు ఉపయోగపడుతుందని ఆ నివేదికల్లో పేర్కొన్నారు. విప్రో సంస్థ తన నాలుగో త్రైమాసికంలో 6,180 మంది ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ఈనెల 19న ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో విప్రో 24,516 ఉద్యోగులను తగ్గించింది.
వరుసగా రెండు త్రైమాసికాల్లో ఉద్యోగులను తగ్గించిన విప్రో
వరుసగా రెండు త్రైమాసికల్లో విప్రో సంస్థ తన ఉద్యోగులను తగ్గించింది. ఈ ఆర్థిక ఏడాది విప్రో ఉద్యోగుల సంఖ్య 2,34,054గా ఉంది. విప్రో సంస్థ ఉద్యోగులను తగ్గించినప్పటికీ విప్రో అట్రిషన్ రేటు ఎల్ టీఎం (గత 12 నెలలు) ప్రాతిపదికన 14.2% వద్ద స్థిరంగానే ఉంది. ఇక ఇన్ఫోసిస్, టీసీఎస్ సంస్థలు కూడా తొలిసారిగా ఉద్యోగుల తగ్గించినట్లు నివేదికల్లో పేర్కొన్నాయి. టీసీఎస్ లో 13,249 మంది ఉద్యోగులను తగ్గించగా... ఇన్ఫోసిస్ 25,994 ఉద్యోగులను తగ్గించింది. ఇక నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ 1,759 మంది ఉద్యోగులను, ఇన్ఫోసిస్ 5,423 మందిని తగ్గించింది. ఉద్యోగుల తగ్గింపునకు అనుగుణంగా ఇన్ఫోసిస్ దాని నియామక విధానాన్ని మారుస్తోంది.
నియామక విధానాన్ని మార్చిన ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ సీఎఫ్ ఓ జయేష్ సంఘ్ రాజ్కా మాట్లాడుతూ... మా నియామక విధానాన్నిమార్చామని, మేము ఇకపై క్యాంపస్ నుండి ఫ్రెషర్‌లందరినీ తీసుకోమని, సగం కంటే తక్కువ మందిని క్యాంపస్ నుంచి సగం కంటే ఎక్కువ మంది క్యాంపస్ వెలుపల నుంచి తీసుకుంటామని వివరించారు. విప్రో తన కోవిడ్ అనంతరం చేపట్టిన నియామకాల్లో ఆఫర్ లెటర్‌లను పొందిన ఫ్రెషర్‌ల కోసం ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు. వారి ఆఫర్ లెటర్ ల ప్రక్రియను త్వరలోనే పూర్తి చే సి వారికి ఉద్యోగాలిస్తామని విప్రో ముఖ్య హెచ్ ఆర్ అధికారి సౌరభ్ గోవిల్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా టీసీఎస్ సంస్థ మాత్రం త్వరలోనే ఫ్రెషర్ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.