'వర్క్ ఫ్రం హోమ్' అనైతికం: ఎలోన్ మస్క్ ఆసక్తికర కామెంట్స్
'వర్క్ ఫ్రం హోమ్'పై టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి టెక్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మస్క్, తాజాగా ఒక అడుగు ముందుకేసి 'వర్క్ ఫ్రం హోమ్' అనేది అనైతికమన్నారు. సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిలికాన్ వ్యాలీలో పని చేసే వారు వర్క్-ఫ్రమ్-హోమ్ మాయ నుంచి బయటపడాలని అన్నారు. సేవా కార్మికులు (ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, క్యాబ్ డ్రైవర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, మొదలైన ) ఇంటి నుంచి పని చేయలేరు కాబట్టి, ఎవరికీ ప్రత్యేక హక్కు ఉండకూడదని స్పష్టం చేశారు.
'వర్క్ ఫ్రం హోమ్' వల్ల ఉత్పాదకతను రాబట్టలేం: మస్క్
'వర్క్ ఫ్రం హోమ్' వల్ల ఉద్యోగుల నుంచి కావాల్సినంత ఉత్పాదకతను రాబట్టలేమని మస్క్ పేర్కొన్నారు. ఇది నైతికంగా తప్పు అని అనుకుంటున్నట్లు చెప్పారు. ట్విట్టర్, టెస్లా, స్పేస్ ఎక్స్ ఉద్యోగులు ప్రతిరోజూ ఆఫీసుకు రావాలని నొక్కి చెప్పారు. మస్క్ అక్టోబర్ 2022లో ట్విట్టర్‌ని కొనుగోలు చేసి ట్విట్టర్ ఉద్యోగుల ప్రపంచాన్ని తలకిందులు చేశారు. అప్పటి వరకు ట్విట్టర్ ఉన్న 'వర్క్-ఫ్రమ్-ఎనీవేర్' విధానాన్ని మార్చేశారు. కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. ట్విట్టర్ ఉద్యోగులు వారానికి కనీసం 40గంటలు పని చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.