LOADING...
Nestle India: మ్యాగీలో పురుగులా?.. వైరల్ ఆరోపణలపై నెస్లే ఇండియా క్లారిటీ
మ్యాగీలో పురుగులా?.. వైరల్ ఆరోపణలపై నెస్లే ఇండియా క్లారిటీ

Nestle India: మ్యాగీలో పురుగులా?.. వైరల్ ఆరోపణలపై నెస్లే ఇండియా క్లారిటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2026
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వెలువడుతున్న ఆరోపణలను ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులు అన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే తయారవుతున్నాయని స్టాక్‌ ఎక్స్చేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. సోషల్‌ మీడియాలో ఓ యూజర్‌ మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయని ఆరోపిస్తూ చేసిన పోస్టును ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) తమ దృష్టికి తీసుకొచ్చినట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి ఎలాంటి శాంపిల్స్‌ అందలేదని తెలిపింది. అలాగే ఆ యూజర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ, అతని వివరాలు అందుబాటులోకి రాలేదని పేర్కొంది.

వివరాలు

ఎలాంటి పురుగులు లేవని ల్యాబ్‌ నిర్ధారణ

ఈ ఆరోపణల నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్‌ శాంపిల్స్‌ను నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ లాబొరేటరీస్‌ (NABL)కు పరీక్షల కోసం పంపినట్లు కంపెనీ తెలిపింది. నిర్వహించిన పరీక్షల్లో తమ ఉత్పత్తుల్లో ఎలాంటి పురుగులు లేవని ల్యాబ్‌ నిర్ధారించినట్లు వెల్లడించింది. అదేవిధంగా మ్యాగీ ఉత్పత్తులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని పరీక్షల నివేదికలో స్పష్టమైనట్లు పేర్కొంది. వినియోగదారుల ఆరోగ్యం, ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని నెస్లే ఇండియా వెల్లడించింది. భవిష్యత్తులోనూ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వినియోగదారులకు ఉత్తమ ఉత్పత్తులను అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

Advertisement