UPI in Greece: గ్రీస్‌లో యూపీఐ ప్రారంభించిన పీయూష్ గోయల్.. వాణిజ్య బంధాలు మరింత బలోపేతం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ రూపొందించిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా తన విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా యూరప్‌కు చెందిన గ్రీస్ దేశంలో యూపీఐ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఏథెన్స్‌లోని యూరోబ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఈ సేవలను ప్రారంభించారు. కార్యక్రమంలో యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీయూష్ గోయల్.. గ్రీస్‌లో యూపీఐ సేవలు అందుబాటులోకి రావడం వల్ల అర్హత కలిగిన వినియోగదారులు వేగంగా, అత్యంత సురక్షితంగా నగదు బదిలీలు నిర్వహించవచ్చని తెలిపారు. సాంప్రదాయ చెల్లింపు విధానాలతో పోలిస్తే లావాదేవీల ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని వివరించారు.
వివరాలు
యూరోబ్యాంక్ సీఈఓ ఫోకియోన్ కరావియాస్‌తో పీయూష్ గోయల్ సమావేశం
సరిహద్దులను దాటి విలువను సృష్టించడం, భాగస్వామ్య దేశాలతో కలిసి ఉమ్మడి అభివృద్ధిని సాధించేలా సాంకేతిక పరిష్కారాలను రూపొందించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టికి ప్రపంచవ్యాప్తంగా యూపీఐకు లభిస్తున్న ఆదరణ నిదర్శనమని గోయల్ తన 'ఎక్స్' వేదికలో పేర్కొన్నారు. గ్రీస్ పర్యటనలో భాగంగా పీయూష్ గోయల్, యూరోబ్యాంక్ సీఈఓ ఫోకియోన్ కరావియాస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్-గ్రీస్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అవసరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని గ్రీక్ వ్యాపారవేత్తలను ఆయన ఆహ్వానించారు. అలాగే గ్రీస్‌లో తయారీ రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు.
వివరాలు
యూరోబ్యాంక్,ఎన్ఐపీఎల్ భాగస్వామ్యంతో గ్రీస్‌లో యూపీఐ సేవలు
యూరోబ్యాంక్,ఎన్ఐపీఎల్ భాగస్వామ్యంతో గ్రీస్‌లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఫెయిర్‌ఫాక్స్ డిజిటల్ సర్వీసెస్ సీఈఓ సంజయ్ తుగ్నైత్ కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, పీయూష్ గోయల్ గ్రీస్ డిప్యూటీ విదేశాంగ మంత్రి హ్యారీ థియోహారిస్తో కలిసి ఇండియా-గ్రీస్ బిజినెస్ ఫోరమ్లో ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి, బలమైన స్థూల ఆర్థిక పునాదులు గ్రీస్‌కు విశేషమైన వ్యాపార అవకాశాలను అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని గ్రీక్ వ్యాపార, వాణిజ్య వర్గాలను ఆహ్వానించిన గోయల్
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమల్లోకి వస్తే వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారంలో కొత్త అవకాశాలు ఏర్పడతాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కీలక రంగాల్లో భారత్‌తో భాగస్వామ్యం పెంచుకోవాలని గ్రీక్ వ్యాపార వర్గాలకు పిలుపునిచ్చారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసి, ఉమ్మడి శ్రేయస్సుకు కొత్త మార్గాలను తెరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.