
UPI: జపాన్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న యూపీఐ సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు అంతర్జాతీయంగా విస్తరిస్తూ,త్వరలో జపాన్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంలో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)అంతర్జాతీయ విభాగం అయిన ఎన్‌ఐపీఎల్,జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ ఎన్టీటీ డేటా తో మంగళవారం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా, జపాన్‌కు వెళ్తున్న భారత పర్యాటకులు చెల్లింపులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించగలుగుతారు. జపాన్‌లోని ఎన్టీటీ డేటా నెట్‌వర్క్‌కు సంబంధించిన వ్యాపార కేంద్రాలు,దుకాణాల్లో భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్లలో యూపీఐ యాప్ ద్వారా QR కోడ్ స్కాన్ చేసి సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఇది అక్కడి వ్యాపారుల లావాదేవీలను వేగవంతం చేసి,వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది.
వివరాలు
ఎన్‌పీసీఐ, జపాన్ ఎన్టీటీ డేటా మధ్య కీలక ఒప్పందం
ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ ఎండీ, సీఈవో రితేష్ శుక్లా ఈ భాగస్వామ్యంపై మాట్లాడుతూ, "ఎన్టీటీ డేటాతో ఏర్పడిన ఒప్పందం జపాన్‌లో యూపీఐ సేవల కోసం మార్గాన్ని సుగమం చేసింది. భారత పర్యాటకులు డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని మెరుగుపరచడం కోసం ఇది ఒక కీలకమైన అడుగు. యూపీఐని ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, అత్యంత విశ్వసనీయ చెల్లింపుల వ్యవస్థగా మేము తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ఇది భాగం" అన్నారు. గణాంకాల ప్రకారం, ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు వరకు సుమారు 2,08,000 మంది భారతీయులు జపాన్‌ను సందర్శించారు. ఇది గత సంవత్సరం కన్నా 36% అధికం. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
వివరాలు
జపాన్ వ్యాపారులకు కొత్త వ్యాపార అవకాశాలు
"భారత పర్యాటకులకు షాపింగ్, చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా చేయడం మా ప్రధాన లక్ష్యం. ఈ ఒప్పందం ద్వారా జపాన్ వ్యాపారులకు కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభిస్తాయి" అని ఎన్టీటీ డేటా జపాన్ పేమెంట్స్ హెడ్ మసనోరి కురిహర తెలిపారు. కాగా, ఎన్టీటీ డేటా జపాన్‌లో అతిపెద్ద కార్డ్ పేమెంట్ ప్రాసెసింగ్ నెట్‌వర్క్ అయిన 'కాఫిస్' (CAFIS)ను నిర్వహిస్తోంది.