TSMC: చిప్‌ల ధరల పెంచనున్న టీఎస్‌ఎంసీ.. స్మార్ట్‌ఫోన్లు మరింత ఖరీదు?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థ టీఎస్‌ఎంసీ(TSMC)వచ్చే ఏడాది నుంచి చిప్‌ల తయారీ ధరలను గరిష్ఠంగా 10శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం,అత్యాధునిక తయారీ పరికరాల వ్యయం అధికమవడం,విదేశాల్లో కొత్త తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారీ పెట్టుబడులు అవసరమవడం వంటి కారణాలతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం ధరల పెంపు అంశంపై టీఎస్‌ఎంసీ ఇప్పటికే తన ప్రధాన ఖాతాదారులతో చర్చలు ప్రారంభించింది. 28నానోమీటర్,16నానోమీటర్, 12నానోమీటర్ ప్రక్రియలతో తయారయ్యే చిప్‌లతో పాటు 6నానోమీటర్ సాంకేతికత ఆధారంగా ఉత్పత్తి చేసే చిప్‌ల తయారీ ధరలు కూడా 2027 నుంచి 10శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివరాలు
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్ ధరలపై ప్రభావం పడే ఛాన్స్
ప్రస్తుతం ఆపిల్, ఎన్విడియా, క్వాల్‌కామ్, మీడియాటెక్, బ్రాడ్‌కామ్, ఇంటెల్ వంటి ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ సంస్థలకు అవసరమైన చిప్‌లను టీఎస్‌ఎంసీ తయారు చేస్తోంది.
దీంతో ఈ కంపెనీలు విడుదల చేసే భవిష్యత్ ఉత్పత్తుల తయారీ వ్యయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్ పరికరాలు వంటి వినియోగ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలపై దీని ప్రభావం పడవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) చిప్‌లు, డేటా సెంటర్ హార్డ్‌వేర్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
అదే సమయంలో మెమరీ చిప్‌ల ధరలు కూడా ఇప్పటికే పెరుగుతున్నాయి.
ఈ పరిణామాల ప్రభావంతో పలు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఇటీవల తమ ఉత్పత్తుల ధరలను సవరించాయి.
వివరాలు
భారత్‌లో కూడా ఈ ప్రభావం
భారత్‌లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తగ్గడానికి మెమరీ చిప్‌ల ధరల పెరుగుదలతో పాటు వినియోగదారుల కొనుగోలు డిమాండ్ బలహీనపడటం ప్రధాన కారణాలని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
టీఎస్‌ఎంసీ ప్రతిపాదిత ధరల పెంపు అమల్లోకి వస్తే, రానున్న రోజుల్లో టెక్నాలజీ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.