Zepto IPO: జెప్టో ఐపీఓలో సంచలన విషయాలు.. రూ.5,900 కోట్ల నష్టం, ఈడీ సమన్లు !
ఈ వార్తాకథనం ఏంటి
జప్టో ఐపీఓకు రంగం సిద్ధమవుతోంది.ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో తన తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కోసం సవరించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ పత్రాల్లో కంపెనీ ఆర్థిక పరిస్థితి, వాటాల విక్రయం,ఈడీ సమన్లు తదితర కీలక అంశాలను వెల్లడించింది. ప్రమోటర్లకు షేర్ల విక్రయానికి నో జప్టో ఐపీఓలో భాగంగా ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.8,010కోట్ల నిధులను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా ప్రస్తుత వాటాదారులు తమ షేర్లను విక్రయించనున్నారు. మొత్తం ఐపీఓ పరిమాణం సుమారు రూ.11వేల కోట్ల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జులైలో ఈ ఐపీఓ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
ప్రమోటర్లకు షేర్ల విక్రయానికి నో
అయితే కంపెనీ వ్యవస్థాపకులు ఆదిత్ పలిచా, కైవల్య వోహ్రా మాత్రం తమ వాటాలను విక్రయించకూడదని నిర్ణయించారు. వీరిద్దరి వద్ద రూ.5 ముఖ విలువ కలిగిన 230 కోట్ల షేర్లు ఉండగా, అవి కంపెనీలో 18.47 శాతం వాటాకు సమానం. మరోవైపు వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు కలిపి 11.35 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఇందులో నెక్సస్ వెంచర్స్ అత్యధికంగా 8.77 కోట్ల షేర్లను అమ్మనుంది. రేజర్ వెంచర్స్ జెప్టో ఎల్‌ఎల్‌సీ, కాంట్రరీ జెప్ హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌సీ, కైజర్ ఫౌండేషన్ హాస్పిటల్స్, ఐజర్ పర్మినెంట్ గ్రూప్ ట్రస్ట్ తదితర సంస్థలు కూడా తమ వాటాలను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నాయి.
వివరాలు
పెరిగిన నష్టాలు.. రెట్టింపైన ఆదాయం
సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో జెప్టో రూ.5,905.19 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ.4,699.71 కోట్లుగా ఉండగా, తాజా ఏడాదిలో మరింత పెరిగింది. అయితే కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఏడాది రూ.11,109 కోట్లుగా ఉన్న ఆదాయం 2025-26లో రూ.22,623 కోట్లకు చేరింది. అలాగే మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.1,538 కోట్ల నికర నష్టాన్ని చవిచూసినట్లు వెల్లడించింది.
వివరాలు
జప్టో ప్రమోటర్లకు ఈడీ సమన్లు
కంపెనీ ప్రమోటర్లైన ఆదిత్ పలిచా, కైవల్య వోహ్రాలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిన విషయాన్ని కూడా ముసాయిదా పత్రాల్లో ప్రస్తావించింది. విదేశీ పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కోరుతూ 2026 ఏప్రిల్ 8న ఈ సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. ఈడీ కోరిన అన్ని పత్రాలను సమర్పించినట్లు జెప్టో వెల్లడించింది. కైవల్య వోహ్రా ఏప్రిల్ 17, 22 తేదీల్లో, ఆదిత్ పలిచా ఏప్రిల్ 20, మే 15 తేదీల్లో ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారని పేర్కొంది. అవసరమైన సమాచారం మొత్తం అందించామని, అనంతరం ఈడీ నుంచి ఎలాంటి అదనపు సమాచారం లేదా నోటీసు అందలేదని స్పష్టం చేసింది.
వివరాలు
కిరాణాకార్ట్ నుంచి జప్టో వరకు
2020లో కిరాణాకార్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రారంభమైన ఈ సంస్థ, తర్వాత జప్టోగా పేరు మార్చుకుని క్విక్ కామర్స్ రంగంలో వేగంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలోని అగ్రశ్రేణి క్విక్ కామర్స్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే బ్లింకిట్ మాతృ సంస్థ ఎటర్నల్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మాతృ సంస్థ స్విగ్గీ స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యాయి. త్వరలో జెప్టో కూడా ఐపీఓ ద్వారా మార్కెట్లో అడుగుపెట్టి ఈ జాబితాలో చేరనుంది.