ప్రముఖ డెలివరీ సంస్థ జోమాటో షేర్లకు రెక్కలు.. 5 శాతం పెరిగిన ధరలు
దేశీయంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అద్భుతంగా పుంజుకుంది. ఈ మేరకు కంపెనీ షేర్లు 5 శాతానికి ఎగబాకాయి. బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ( బాంబే స్టాక్ ఎక్స్చేంజ్) ట్రేడింగ్ ప్రారంభ సమయంలోనే అదరగొట్టింది. దీంతో జోమాటో ఒక్కో షేర్ ధర రూ.99.01 పలికింది. ఈ మేరకు 4.61 శాతానికి పెరిగింది. ఫుడ్ డెలివరీ దిగ్గజంతో ముడిపడి ఉన్న బ్లాక్ డీల్ ఊహాగానాల నేపథ్యంలోనే బుధవారం ప్రారంభ ట్రేడింగ్ లో జోమాటో షేర్ 5 శాతం దూసుకెళ్లింది. జోమాటో షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో చివరగా 5.12 శాతం మేర పెరిగాయి. దీంతో ఒక్కో షేర్ రూ.99.50కి పలకడం విశేషం.
బ్లాక్ డీల్ ఊహాగానాల కారణంగానే దూసుకెళ్లిన జోమాటో షేర్లు
మరోవైపు బ్లాక్ డీల్ కారణంగానే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో జొమాటో షేర్లు ఎగబాకినట్లు మార్కెట్ నిపుణలు అంచనా వేస్తున్నారు. ఇటీవలే జోమాటో కంపెనీలో 1.17 శాతం వాటాకు సమానమైన దాదాపు 10 కోట్ల మేర షేర్లు ఒక్కోటి రూ.94.70 వద్ద ట్రేడ్ అయ్యింది. దీంతో ఈ డీల్ మొత్తం విలువ రూ. 947 కోట్లుగా మారింది. ఈ లావాదేవీలో పాల్గొన్న కొనుగోలుదారులు, విక్రేతలను వెంటనే గుర్తించలేదు. అయినప్పటికీ సాఫ్ట్‌బ్యాంక్ తన వెంచర్ క్యాపిటల్ ఫండ్, సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ ద్వారా ఫుడ్ డెలివరీ దిగ్గజం జోమాటోలో 1.17 శాతం వాటాను విక్రయించాలని చూస్తున్నట్లు గతంలోనే ఓ నివేదిక బహిర్గతం చేసింది.