Loading...
Varanasi: 'వారణాసి'లో బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ.. కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
'వారణాసి'లో బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ.. కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!

Varanasi: 'వారణాసి'లో బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ.. కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 20, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'వారణాసి'(Varanasi). దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్నారు. ఈచిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి కథాంశంపై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు, ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. 'వారణాసి' కథ, అందులోని భావోద్వేగాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 'వారణాసి' టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమనే విషయం తెలిసిందే. అయితే ఇందులో సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలతో పాటు పౌరాణిక నేపథ్యం, భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేసినట్లు రాజమౌళి తెలిపారు. 'సినిమా చూస్తున్నప్పుడు ఇది సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంలా అనిపించవచ్చు. కానీ, వాస్తవానికి ఇది పౌరాణిక అంశాలతో కూడిన ఫాంటసీ మూవీ.

వివరాలు

ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది

ఇందులో తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధంతో పాటు ఓ యువతీయువకుడి మధ్య సాగే అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది.

ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా రూపొందించిన అనుభూతి కలుగుతుంది. వాటన్నింటినీ ఒకే కథలో సమన్వయం చేయడమే 'వారణాసి' విషయంలో నాకు ఎదురైన అతిపెద్ద సవాలని రాజమౌళి వివరించారు.

ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి మరో కీలక విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ఇంకా కేవలం 10 రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు.

దీంతో గతంలో చెప్పినట్లుగానే అక్టోబరు నాటికి చిత్రీకరణ పూర్తికానున్నట్లు స్పష్టమవుతోంది.

నవంబరు నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులపై దృష్టి సారిస్తూనే, సినిమా ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

అంచనాలకు మించి నటించిన మహేశ్‌బాబు

'వారణాసి'లో మహేశ్‌బాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తారని ముందుగానే భావించినట్లు రాజమౌళి తెలిపారు.

అయితే సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాక తన అంచనాలను మహేశ్‌ మరింతగా అధిగమించారని ప్రశంసించారు.

'మహేశ్‌ నటనా సామర్థ్యం గురించి నాకు ముందే తెలుసు. కానీ, ఆయనతో కలిసి పనిచేయడం ప్రారంభించిన తర్వాత నా అంచనాలకు మించి నటించారు.

నేను ఊహించిన దానికంటే రెండు వందల శాతం ఎక్కువగా తన ప్రతిభను చూపించారు.

ADVERTISEMENT

వివరాలు

వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్

తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి, దానికి ప్రాణం పోశారు. ఆయన నటన చూసి నేను ఆశ్చర్యపోయానని రాజమౌళి పేర్కొన్నారు.

మహేశ్‌బాబుతో కలిసి పనిచేయడం తనకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని దర్శకధీరుడు తెలిపారు.

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'వారణాసి'పై రాజమౌళి తాజా వ్యాఖ్యలతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT