LOADING...
Manchu Vishnu: భక్తితో తీసిన సినిమా.. తప్పుగా అర్థం చేసుకోవద్దు.. కన్నప్ప వివాదంపై మంచు విష్ణు క్లారిటీ!
భక్తితో తీసిన సినిమా.. తప్పుగా అర్థం చేసుకోవద్దు.. కన్నప్ప వివాదంపై మంచు విష్ణు క్లారిటీ!

Manchu Vishnu: భక్తితో తీసిన సినిమా.. తప్పుగా అర్థం చేసుకోవద్దు.. కన్నప్ప వివాదంపై మంచు విష్ణు క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన అంశం 'పిలక-గిలక' వివాదం. నటుడు మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క పౌరాణిక చిత్రం 'కన్నప్ప'లోని కొన్ని పాత్రల పేర్లు బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీశాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 'పిలక', 'గిలక' అనే పాత్రల పేర్లతో పాటు, వాటికి సంబంధించిన కొన్ని డైలాగులు బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచినట్లుగా ఉన్నాయని ఆరోపిస్తూ, బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తూ, ఈ అంశంపై మోహన్ బాబు కుటుంబం యావత్ మానవ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. వివాదాస్పద సన్నివేశాలను వెంటనే తొలగించకపోతే, చిత్రం విడుదలను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు.

Details

ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదు

ఈ ఆరోపణలపై హీరో మంచు విష్ణు స్పందిస్తూ... కన్నప్ప సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా రూపొందించామని స్పష్టం చేశారు. సినిమా ప్రధాన ఉద్దేశం భక్తి తత్వాన్ని విస్తరించడం మాత్రమేనని, దానికితప్ప మరే ఉద్దేశం లేదన్నారు. పరమశివునిపై అపారమైన భక్తితో ఈ చిత్రం రూపొందించామన్నారు. విష్ణు చెప్పిన ప్రకారం, షూటింగ్ సమయంలో ప్రతీ రోజూ దేవునికి పూజలు నిర్వహించడంతో పాటు, వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకునే సంప్రదాయాన్ని పాటించారట. అంతేగాక స్క్రిప్ట్ దశలోనే వేదాధ్యయనం చేసిన వారు, ఆధ్యాత్మిక వేత్తల సూచనలు తీసుకుని సన్నివేశాలు రూపొందించామన్నారు. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల కాకముందే అభిప్రాయాలు వెలిబుచ్చకండని, ఓపికగా ఉండాలని ప్రజలను కోరారు.

Details

పిలక, గిలక పాత్రలో బ్రహ్మానందం, సప్తగిరి

వివాదాస్పద పాత్రల విషయానికొస్తే, బ్రహ్మానందం "పిలక" పాత్రలో, సప్తగిరి "గిలక" పాత్రలో నటించారు. గతేడాది విడుదలైన ఒక పోస్టర్‌లో ఈ పాత్రలపై "చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట నేర్పిన గుగ్గుగురువులు.. అడవికి పాఠాలు చెప్పడానికి వస్తే.." అనే క్యాప్షన్‌తో ప్రచారం జరిగింది. ఆ సమయంలో పెద్దగా చర్చ జరగకపోయినా, ఇప్పుడు ఈ పోస్టర్ నేపథ్యంలోనే వివాదం ముదురుతోంది. ఈ వివాదంపై మంచు ఫ్యామిలీ అభిమానులు స్పందిస్తూ - గతంలో రిలీజైన ఈ పోస్టర్‌కి అప్పట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు, ఇప్పుడు చిత్ర విడుదల దగ్గర పడుతుండగా ఇంత రాద్దాంతం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

Details

జూన్ 27న రిలీజ్

కన్నప్ప సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.