Gandhi Talks Trailer: మాటలు లేని భావాల ప్రయాణం.. విజయ్ సేతుపతి మూకీ చిత్రం ట్రైలర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో కిషోర్ పి. బెలేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూకీ సినిమా 'గాంధీ టాక్స్' (Gandhi Talks) మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రత్యేకతతో నిలిచిన ఈ సినిమా జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'ప్రతి కథకు మాటలు అవసరం లేదు.. కొన్ని దృశ్యాలు చూడగానే మనసును తాకుతాయి. ఈసారి తెరపై మాటలు ఉండవు.. అది మిమ్మల్ని వినేలా మాత్రమే చేస్తుందనే భావనతో రూపొందిన ఈ ట్రైలర్ భావోద్వేగంగా ఆకట్టుకుంటోంది.
Details
ఏఆర్ రెహమాన్ సంగీతం
డైలాగ్‌లు లేకుండా కేవలం విజువల్స్, భావప్రధాన కథనం ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే ప్రయత్నం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. నటీనటుల అభినయం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనుండగా, సంగీత దర్శకుడు 'ఏఆర్ రెహమాన్' అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో హైలైట్‌గా నిలవనుంది. ఆయన సంగీతం ఈ మూకీ కథనానికి మరింత లోతు, భావోద్వేగాన్ని జోడించనుందని ట్రైలర్ ద్వారానే అర్థమవుతోంది. ఈ చిత్రంలో అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాటలకన్నా భావాలకు ప్రాధాన్యం ఇచ్చే ఈ మూకీ ప్రయోగం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి.