Dadasaheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే అంటే ఏమిటి..? ఎందుకీ అవార్డు ఇస్తారు..?
మూవీ మొఘల్‌గా పేరొందిన దాదాసాహెబ్ ఫాల్కే, అసలు పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే.1870 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని టింబక్ అనే గ్రామంలో జన్మించారు. ఆయనను భారతీయ సినిమాకు పితామహుడిగా భావిస్తారు.ఎందుకంటే ఆయననే తొలి భారతీయ సినిమా రూపొందించిన ఘనుడు. చిన్నతనంలోనే కళలపై ఆసక్తి ఉన్న ఫాల్కే, 1885లో ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు. అక్కడ ఫొటోగ్రఫీ, లిథోగ్రఫీ, ఆర్కిటెక్చర్,డ్రామా వంటి కళల్ని నేర్చుకున్నారు. మ్యాజిక్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆయన కొంతకాలం పెయింటర్, సినిమా సెట్ల డిజైనర్, ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు.
1913లో తొలి భారతీయ మూకీ చిత్రం 'రాజా హరిశ్చంద్ర'
ప్రముఖ చిత్రకారుడు రవివర్మ ప్రెస్‌లో పనిచేస్తూ, ఆయన గీసిన హిందూ దేవుళ్ల చిత్రాలపై స్ఫూర్తిని పొందారు. 1908లో 'ఫాల్కేస్ ఆర్ట్ ప్రింటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ వర్క్స్' అనే పేరుతో ప్రారంభించాడు. కానీ భాగస్వామితో వచ్చిన విభేదాలతో మధ్యలోనే అది ఆగిపోయింది. 1910లో మూకీ చిత్రం 'ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్'ను చూసి, భారతదేశంలో సినిమా నిర్మాణం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. 1912లో ఇంగ్లండ్‌కు వెళ్లి, సినిమా నిర్మాణానికి సంబంధించిన నైపుణ్యాలను అభ్యసించారు. తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన ఫాల్కే, 1913లో తొలి భారతీయ మూకీ చిత్రం 'రాజా హరిశ్చంద్ర'ను విడుదల చేశారు.
సినిమా రంగంలో మహిళల ప్రాధాన్యత
ఈ చిత్రానికి కథ, దర్శకత్వం, పంపిణీ, నిర్మాణం వంటి అన్ని బాధ్యతలు ఆయనే నిర్వహించారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో మైలురాయి అయింది. 1913లో 'భస్మాసుర్ మోహిని'లో మహిళను ప్రధాన పాత్రలో నటింపజేసి, సినిమా రంగంలో మహిళల ప్రాధాన్యతను పెంచారు. 1917లో హిందుస్తాన్ ఫిల్మ్ కంపెనీని స్థాపించిన ఫాల్కే, 'లంకా దహన్' (1917), 'శ్రీ కృష్ణ జన్మ' (1918), 'సైరంధ్రి' (1920), 'శకుంతల' (1920) వంటి పౌరాణిక సినిమాలను నిర్మించారు. 1930 నుంచి సినిమాలు నిర్మించడం ఆపేశారు. భారతీయ సినిమాకు అమితమైన సేవలందించిన ఫాల్కే, 1944 ఫిబ్రవరి 16న నాసిక్‌లో కన్నుమూశారు.
ఫాల్కే కుటుంబ నేపథ్యం
ఫాల్కే భార్య సరస్వతి, తొలి భారతీయ సినిమా 'రాజా హరిశ్చంద్ర' నిర్మాణంలో తన వంతు సేవలందించారు. ఆమె భారతీయ సినిమా టెక్నీషియన్ ఆమెనే. షూటింగ్ సమయంలో వెలుతురు కెమెరాపై పడకుండా బెడ్ షీట్‌ను పట్టుకుని ఉండేవారట. ఆమెనే షూటింగ్‌కు కావలసిన అన్ని విషయాలను సమకూర్చేవారు. రాత్రి సమయంలో క్యాండిల్ వెలుగులో సాంకేతిక పనులు నిర్వహించేవారట. చిత్రబృందానికి వంట చేసి పెట్టే పని కూడా ఆమెనే చేస్తుండేది. ఫాల్కే కుమారుడు బాలచంద్ర, 'రాజా హరిశ్చంద్ర'లో హరిశ్చంద్రుని కుమారునిగా నటించాడు.
దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో అవార్డు
ఈ చిత్రంలో అతనే తొలి భారతీయ బాలనటుడు కావడం విశేషం. ఫాల్కే పెద్ద కూతురు మందాకిని, శ్రీకృష్ణ జననం, కాళీయ మర్దన్ చిత్రాలలో బాల శ్రీకృష్ణునిగా నటించింది. ఫాల్కేకు సొంత ఇల్లు లేకపోవడంతో శాంతారాం ఆయనకు నాసిక్‌లో ఒక ఇంటిని కొనిపించారు, అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. బొంబాయి జూబ్లీ ఉత్సవాల సందర్భంగా బహుమతి పొందిన తర్వాత, ఫాల్కే తన స్వగ్రామం టింబక్ చేరుకున్నారు. 90 సినిమాలను నిర్మించిన ఈ భారతీయ సినిమా పితామహుడు, చాలా పేదరికంలో కన్నుమూశారు. దాదాసాహెబ్ ఫాల్కే చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఆయన పేరుతో ఓ అవార్డును ప్రకటించింది.