
Abhinav Shukla: బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లా హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు అభినవ్ శుక్లా తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుని నుంచి హత్య బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు.
ఈ బెదిరింపులకు కారణమైన అనుమానితుడి వివరాలను ఆయన తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.
ఇందుకు సంబంధించి పంజాబ్,చండీగఢ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ స్పందించాలని కోరారు.
అభినవ్ వెల్లడించిన వివరాల ప్రకారం,అతని సోషల్ మీడియాలోని అకౌంట్‌కు ఒక వ్యక్తి నుంచి సందేశం వచ్చింది.
వివరాలు
కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బందికీ కూడా బెదిరింపులు
ఆ సందేశంలో "నేను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవాడిని. నీ ఇంటి చిరునామా నాకు తెలుసు. ఇటీవల సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిపిన కాల్పులా,త్వరలో నీ ఇంటిపైనా దాడి జరుగుతుంది. ఇది నీకు చివరి హెచ్చరిక. అసిమ్ గురించి గౌరవంగా మాట్లాడండి లేదంటే.. బిష్ణోయ్ గ్యాంగ్ లిస్టులో నీ పేరు చేరుతుంది" అని పేర్కొన్నాడు.
ఈ బెదిరింపులు కేవలం తనకే కాకుండా, తన కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బందికీ వచ్చాయని అభినవ్ తెలిపారు.
ఈ బెదిరింపులను పంపిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వివరాలను కూడా ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు.
తనకు,తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ ఆయన పోలీసులను కోరారు.అదే విధంగా, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వివరాలు
అభినవ్‌ను టార్గెట్ చేస్తున్న అసిమ్ అభిమానులు
ఇటీవల అభినవ్ శుక్లా భార్య రుబినా, బిగ్‌బాస్ ఫేమ్ అసిమ్ రియాజ్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
ఈ వివాదం మరింత ముదరడంతో, అభినవ్ అసిమ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
దీని నేపథ్యంలో అసిమ్ అభిమానులు అభినవ్‌ను టార్గెట్ చేస్తూ బెదిరింపులు పంపుతున్నారు.
తాజాగా వచ్చిన బెదిరింపు సందేశం కూడా అసిమ్ అభిమానులే పంపినదిగా అభినవ్ ఆరోపించారు.