ప్రముఖ హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ కన్నుమూత
ప్రముఖ తమిళ హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కోలీవుడ్ నిర్మాత ఎం.ఆర్. సంతానం కుమారుడే శివాజీ. ఈయన 1956లో చెన్నైలో జన్మించారు. శివాజీ చివరిసారిగా సెప్టెంబర్ 1న విడుదలైన యోగి బాబు నటించిన 'లక్కీమాన్'లో కనిపించారు. శివాజీ సోదరుడు, సంతాన భారతి కూడా నటుడిగా, దర్శకుడిగా కోలీవుడ్‌లో కొనసాగుతున్నారు. 1980వ దశకంలో శివాజీ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఆయన నటించారు. కమలహాసన్‌తో శివాజీకి మంచి అనుబంధం ఉంది. శివాజీ తెలుగులో చిరంజీవి జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాలో నటించి మెప్పించారు.