Actor Harish Kumar : ఆ హీరోయినే నన్ను కాపాడింది.. లేకపోతే అప్పుడే చచ్చిపోయేవాడ్ని.. రివీల్ చేసిన హీరో
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేమకథల ఆధారంగా రూపొందిన సినిమాలు ఎప్పటికప్పుడు మంచి విజయాలు సాధిస్తూనే ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో కూడా ఎన్నో ప్రేమకథా చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. అలాంటి చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా "ప్రేమ ఖైదీ". ఆ కాలంలో ఈ సినిమా పెద్ద సంచలనం సృష్టించింది. యువ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమాను వీక్షించారు. ఎలాంటి పెద్ద అంచనాలు లేకుండానే విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో హీరో హరీష్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా పేరు సంపాదించాడు. ఒకే సినిమా ద్వారా ఆయన ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు.
వివరాలు
ఈ హీరోకు సక్సెస్ రేట్ ఎక్కువ..
"ప్రేమ ఖైదీ" విజయంతో హరీష్‌కు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. "ప్రేమ కానుకగా", "ప్రేమాభిషేకం" వంటి చిత్రాలతో ఆయన ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అదేవిధంగా "పెళ్లాం చెబితే వినాలి", "రౌడీ ఇన్‌స్పెక్టర్", "కాలేజ్ బుల్లోడు", "ప్రేమ విజేత", "ప్రాణదాత", "మనవరాలి పెళ్లి", "బంగారు కుటుంబం" వంటి సినిమాల ద్వారా ఆ కాలంలో మంచి స్టార్‌డమ్ సంపాదించాడు. హీరోగా మాత్రమే కాకుండా, హరీష్ చిన్నప్పటి నుంచే బాలనటుడిగా కూడా పలు చిత్రాల్లో నటించాడు. "ఆంధ్రకేసరి", "ఓహో నా పెళ్లంట" సినిమాల్లో బాలనటుడిగా నటించి నంది అవార్డులు అందుకున్నాడు. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.
వివరాలు
లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో..
దక్షిణ భారతంతో పాటు ఉత్తర భారతంలో కూడా ఆయనకు మంచి అభిమాన వర్గం ఉండేది. భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన హరీష్‌కు ఆ సమయంలో మహిళా అభిమానులు కూడా అధికంగా ఉండేవారు. అయితే వరుస విజయాల తర్వాత ఆయనకు కొన్ని అపజయాలు ఎదురయ్యాయి. దాంతో క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. అనంతరం కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించిన ఆయన, ఆ తర్వాత పూర్తిగా సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. ఇటీవల హరీష్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
అలా బతికి బయటపడిన హీరో
"ప్రేమ ఖైదీ" సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారు. ఆ చిత్రంలో హరీష్ హీరోగా నటించగా, హీరోయిన్‌గా కరిష్మా కపూర్ నటించింది. సినిమాలో ఒక సన్నివేశంలో హీరోయిన్ స్విమ్మింగ్ పూల్‌లోకి దూకుతుంది. ఆమెను రక్షించడానికి హీరో కూడా నీళ్లలోకి దూకాల్సి ఉంటుంది. అయితే హరీష్‌కు ఈత రాదని తెలియకుండానే చిత్ర యూనిట్ లోతైన పూల్‌ను ఏర్పాటు చేసింది. సన్నివేశం చిత్రీకరణలో భాగంగా పూల్‌లోకి దూకిన హరీష్ నీళ్లలో మునిగిపోవడం ప్రారంభమైంది. పరిస్థితి తీవ్రంగా మారుతుండటాన్ని గమనించిన హీరోయిన్ కరిష్మా కపూర్ వెంటనే స్పందించి ఆయనను కాపాడింది. ఆమె దుస్తులను పట్టుకుని తాను నీళ్లలో నుంచి బయటకు వచ్చానని హరీష్ ఆ ఇంటర్వ్యూలో వివరించాడు.