Matthew Perry: హాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ కన్నుమూత
హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమిడియన్, నిర్మాత మాథ్యూ పెర్రీ(Matthew Perry, 54) కన్నుమూశారు. హాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్ 'Friends' సిరీస్‌లో చాండ్లర్ బింగ్ పాత్ర ద్వారా పెర్రీ విశేషమైన గుర్తింపు పొందారు. లాస్ ఏంజిల్స్‌లోని అతని నివాసంలో ఆయన శనివారం హాట్ టబ్‌లో శవమై కనిపించారు. పెర్రీ మరణాన్ని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ధృవీకరించారు. అతని మరణానికి కారణం తెలియరాలేదు. అయితే లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ మాత్రం పెర్రీ మరణంపై దర్యాప్తు చేస్తున్నారు. పెర్రీ ఆగస్టు 19, 1969న మసాచుసెట్స్‌లోని విలియమ్స్‌టౌన్‌లో జన్మించారు. కెనడాలోని ఒట్టావాలో పెరిగారు. అక్కడ ఉన్న సమయంలో ప్రస్తుత కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోతో కలిసి ప్రాథమిక పాఠశాలలో చదివారు.
తండ్రి ప్రోత్సాహంతో నటనలోకి..
పెర్రీ తల్లి సుజానే మారిసన్ జర్నలిస్ట్‌గా ఉండేవారు. జస్టిన్ ట్రూడో తండ్రి అయిన పియరీ ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు మారిసన్ ప్రెస్ సెక్రటరీగా పని చేశారు. మాథ్యూ పెర్రీ తండ్రి పేరు జాన్ బెన్నెట్ పెర్రీ. ఈయన నటుడు, మోడల్‌గా చాలా పాపులర్. తండ్రి ప్రోత్సాహంతోనే పెర్రీ నటనవైపు మొగ్గు చూపారు. 1979లో తన తండ్రి కాప్ షో "240-రాబర్ట్"లో అతిథి పాత్ర ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. కెరీర్ తొలినాళ్లలో టెలివిజన్‌లో ఏ పాత్ర దొరికినా నటించేవారు. ఆ తర్వాత 'బాయ్స్ విల్ బి బాయ్స్'లో చాజ్ రస్సెల్ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 'గ్రోయింగ్ పెయిన్స్', 'సిడ్నీ' వంటి ధారావాహికలలో కనిపించాడు.
పెర్రీ కెరీర్‌ని మార్చేసిన 'Friends' సిరీస్
1994లో వచ్చిన ఎన్‌బీసీ సిట్‌కామ్ 'Friends' సిరీస్‌తో పెర్రీ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సిరీస్ 10 ఎపిసోడ్లు వచ్చింది. 1994 నుంచి 2004 వరకు నడిచింది. హాలీవుడ్ టెలివిజన్ చరిత్రలో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. 2002లో ఉత్తమ హాస్య ధారావాహిక ఎమ్మీ అవార్డును కూడా 'Friends' గెలుచుకుంది. ఇందులో హస్య నటుడిగా పెర్రీ నటన అద్భుతం అని చెప్పాలి. పెర్రీ కొంతకాలంగా వ్యసనాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పెద్దపేగులో సమస్య కారణంగా 2018లో ఐదు నెలల ఆసుపత్రిలోనే ఉన్నారు. అలాగే పెర్రీ కొంతకాలంగా విపరీతంగా మద్యానికి బానిస అయ్యారు. దీని వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది.