సిద్ధార్థ్ బర్త్ డే: తెలుగులో స్టార్ గా ఎదిగిన సిద్ధార్థ్ మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించేదెప్పుడు?
సిద్ధార్థ్.. ఈరోజు ఆయన బర్త్ డే. అసిస్టెంట్ డైరెక్టర్ గా మణిరత్నం దగ్గర పనిచేసి, అమృత సినిమాలో చిన్న వేషం వేసి, ఆ తర్వాత నటనను కెరీర్ గా మార్చుకున్నాడు. బాయ్స్ సినిమాతో హీరోగా మారిన సిద్ధార్థ్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2005లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత తెలుగులో తీసిన చుక్కల్లో చంద్రుడు ఫ్లాప్ అయినా కూడా 2006లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. తెలుగు సినిమా చరిత్రలో మంచి కుటుంబ కథా చిత్రంగా మిగిలిపోయింది బొమ్మరిల్లు చిత్రం. అప్పటి నుండి సిద్ధార్థ్, పూర్తిస్థాయి తెలుగు హీరోగా మారిపోయాడు.
బొమ్మరిల్లు స్థాయి హిట్ తెచ్చుకోలేక తెలుగుకు దూరమైన సిద్ధార్థ్
బొమ్మరిలు తర్వాత సిద్ధార్థ్ కి డిమాండ్ బాగా పెరిగింది. తెలుగులో సెటిల్ అయిపోయినట్లే అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆట, బావ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి. తెలుగులో వరుసగా సినిమాలు చేసినా బొమ్మరిల్లు మాదిరి హిట్ రాలేకపోయింది. 180, ఓ మై ఫ్రెండ్, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్ చిత్రాలు సిద్ధార్థ్ కెరీర్లో డిజాస్టర్లుగా మిగిలాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమాలో అతిధి పాత్రలో కనిపించాడు సిద్ధార్థ్. బాద్ షా తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. 2021లో మహాసముద్రం సినిమాతో తిరిగి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో చేస్తున్నాడు.