LOADING...
Aishwarya Rai: ఐశ్వర్య చిత్రాలను వాడకుండా ఆన్‌లైన్ వేదికలపై నిషేధం విధించిన ఢిల్లీ హైకోర్టు
ఐశ్వర్య చిత్రాలను వాడకుండా ఆన్‌లైన్ వేదికలపై నిషేధం విధించిన ఢిల్లీ హైకోర్టు

Aishwarya Rai: ఐశ్వర్య చిత్రాలను వాడకుండా ఆన్‌లైన్ వేదికలపై నిషేధం విధించిన ఢిల్లీ హైకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2025
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె ఫొటోలు,పేరును అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం కీలక తీర్పు ఇచ్చింది. ఇకపై ఐశ్వర్యారాయ్ అనుమతి లేకుండా ఆమె చిత్రాలను లేదా వ్యక్తిగత హక్కులను దుర్వినియోగం చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఆమెకు ప్రచార హక్కులు (Promotional Rights) వ్యక్తిగత హక్కులు (Personality Rights) చట్టపరంగా రక్షణ లభించింది.

వివరాలు 

వివాదాస్పద యూఆర్ఎల్‌లను బ్లాక్ చేయాలని కేంద్రానికి ఆదేశం 

అనధికారికంగా ఐశ్వర్య ఫొటోలను వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించడం వల్ల ఆమెకు ఆర్థిక నష్టం తప్పక కలుగుతుండటమే కాకుండా,ఆమె ప్రతిష్ఠ,గౌరవం,సామాజిక గుర్తింపు నాశనం అవుతున్నది. ఇది స్పష్టంగా ఆమె వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన అని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న అనేక ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లు, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న అన్ని వివాదాస్పద URLలను తక్షణమే తొలగించి, బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశించింది. నోటీసులు అందుకున్న72 గంటలలోపు URL లను బ్లాక్ చేయాలి.పూర్తిగా ఆదేశాలను అమలు చేయడం కోసం 7రోజులు గడువు ఇచ్చింది. ఈ ఆదేశాలను కేంద్ర ఐటీ,సమాచార శాఖ అనుసరించాలి అని స్పష్టంగా సూచించింది.

వివరాలు 

2026 జనవరి 15వ తేదీకి వాయిదా

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులను పరిరక్షించడంలో ఇది ఒక మైలురాయి తీర్పుగా నిలవనుంది. ఈ ఘటన ద్వారా ఆన్‌లైన్ వేదికలు సెలబ్రిటీల హక్కులను గౌరవించడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. మిస్ వరల్డ్ 2000 విజేతగా, బాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తన అందం, నటన ద్వారా ప్రముఖ కథానాయికగా ఐశ్వర్యారాయ్ బచ్చన్ గత దశాబ్దాలుగా రాణిస్తున్నారు. కాగా, ఈ కేసులో తదుపరి విచారణను 2026 జనవరి 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.