ఆదిపురుష్ సినిమాను థియేటర్ల నుండి తీసేయాలని ప్రధాని మోదీకి లేఖ
ఆదిపురుష్ చిత్రంపై రోజురోజుకూ వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కటి కాదు రెండు ఎన్నో వివాదాలు ఆదిపురుష్ చిత్రబృందాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆదిపురుష్ సినిమాలో రాముడు, హనుమంతుడు, ఇంకా ఇతర పాత్రలను దేవుళ్ళలాగా చూపించలేదని, వీడియో గేమ్స్ లో ఉండే బొమ్మల్లాగా చూపించారనీ, రామాయణాన్ని వక్రీకరించినట్టుగా ఉందని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ యూనియర్న్, ప్రధాని మోదీకి లేఖ రాసింది. భారతీయ సనాతన సంప్రదాయాలకు విరుద్ధంగా ఆదిపురుష్ చిత్రంలో డైలాగులు ఉన్నాయని, దర్శకుడు ఓం రౌత్, రచయితలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సినిమాను నిలిపివేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని బ్యాన్ చేయాలని అయోధ్య గుడి ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కూడా డిమాండ్ చేసారు.
ఆదిపురుష్ కలెక్షన్లపై వివాదాల ప్రభావం
ఇప్పటికే నేపాల్ లో ఖాట్మాండు, పోఖారా నగరాల్లో ఆదిపురుష్ సహా అన్ని హిందీ సినిమాలపై నిషేధం విధించారు. ఆదిపురుష్ చిత్రంలో సీత జన్మస్థానం భారతదేశం అని చూపించారనీ, నిజానికి సీత, నేపాల్ లోని జనక్ పూర్ లో పుట్టిందని ఖాట్మాండు మేయర్ వాదిస్తున్నారు. వరుసగా వస్తున్న వివాదాలు ఆదిపురుష్ కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ వసూళ్ళు 375కోట్లుగా ఉన్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా క్రితిసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్ దత్త నాగి కనిపించారు. ఈ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కించాడు.