Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. ఆపై ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చారు. అయితే, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ ముందుగానే పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. అటు, అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో సినీ పరిశ్రమలో ఉన్నవారితో పాటు ఆయన అభిమానులు కూడా చాలా షాక్‌కి గురయ్యారు. ఈ సంఘటనపై ముందుగా అల్లు అర్జున్ స్పందించారు.
రేవతి కుటుంబానికి రూ. 25 లక్షలు
రేవతి కుటుంబానికి తన అండగా ఉంటానని, తమ తరఫున అన్ని విధాలా సహాయం చేయాలని పేర్కొన్నారు. "సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి విని నేను చాలా షాక్ అయ్యాను.ఈ వార్త వల్ల పుష్ప సినిమా సెలబ్రేషన్స్‌లో నేను యాక్టివ్‌గా పాల్గొనలేకపోయాను.మేము సినిమా తీస్తే,ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి ఆనందించాలి అనే ఉద్దేశ్యంతో పనిచేస్తాం.రేవతి గారి కుటుంబానికి నా లోతైన సంతాపం తెలియజేస్తున్నాను.నా తరఫున వారి కుటుంబానికి రూ. 25 లక్షలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను.మా టీమ్ కూడా మరిన్ని సాయం చేయడానికి సిద్ధంగా ఉంది.ఈ బాధిత కుటుంబానికి నాకు సాధ్యమైనంత సాయం చేస్తాను.రేవతి కుటుంబాన్ని త్వరలోనే స్వయంగా కలవాలని అనుకుంటున్నాను"అని ట్విట్టర్ వేదికగా ఒక వీడియో ద్వారా తెలిపారు అల్లు అర్జున్.